Mumbai Rains Live updates : ముంచెత్తుతున్న వర్షం.. ముంబైలో రెడ్ అలర్ట్

by Shamantha N |   ( Updated:2021-06-09 07:05:28.0  )
Mumbai Rains Live updates : ముంచెత్తుతున్న వర్షం.. ముంబైలో రెడ్ అలర్ట్
X

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రహదారులు, రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ అప్రమత్తమై ముంబై మహానగరంలో బుధవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో నాలుగైదు రోజులు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని హెచ్చరించింది. 30 ప్రాంతాల్లో బస్సు రూట్లను మళ్లించారు. అంధేరి, మలాడ్, ఖార్, మిలన్ సబ్‌వేలలో ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు. లోకల్ ట్రైన్‌ సేవలు స్తంభించాయి. సీఎస్టీ, కుర్లాల మధ్య రైల్వే సేవలను నిలిపేసినట్టు అధికారులు వెల్లడించారు. కొలాబా, సాంటాక్రజ్‌లలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 5.30 గంటల మధ్య వరుసగా 65.4 ఎంఎం, 50.4 ఎంఎంలుగా నమోదైంది.

సీఎం ఉద్ధవ్ ఠాక్రే బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లోని డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. వర్షాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తీరప్రాంతం సహా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని, వేగంగా వరద నీటిని ఎత్తిపోయాలని ఆదేశించారు. ట్రైన్ సేవలు వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రత్నగిరి, థానె, రాయిగడ్, సింధుదుర్గ్, పాల్‌గడ్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు.

నైరుతి రుతుపవనాలు ముంబైకి రెండు రోజులు ముందుగానే చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్‌లోని పలుప్రాంతాలకూ నైరుతి రుతుపవనాలు ప్రవేశించ వచ్చునని, తద్వారా వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ బుధవారం అంచనా వేసింది. ముంబైకి సాధారణంగా జూన్ 10న రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ సారి రెండు రోజులు ముందుగానే వచ్చాయని ఐఎండీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జయంత సర్కార్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed