‘ముంబై డైరీస్ 26/11’.. వైద్యుల కోణం

by Shyam |
‘ముంబై డైరీస్ 26/11’.. వైద్యుల కోణం
X

దిశ, వెబ్‌డెస్క్ : నిమిషాల్లో రెస్పాన్స్, సెకన్లలో రియాక్షన్, కర్తవ్య నిర్వహణలో తక్షణ నిర్ణయం, ముంబై టెర్రర్ ఎటాక్ జరిగి 12 ఏళ్లవుతున్న సందర్భంగా.. ఈ ఘటనలో హీరోలకు నివాళులర్పిస్తూ తన వెబ్ షో ‘ముంబై డైరీస్ 26/11’ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు నిఖిల్ అద్వానీ. మోహిత్ రైనా, కొంకణా సేన్ శర్మ, టీనా దేశాయ్, శ్రేయా ధన్వంతరి ప్రధానపాత్రల్లో నటించిన ఈ సిరీస్.. 2008లో జరిగిన 26/11 ఉగ్రదాడుల సమయంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది జనాలను కాపాడుకునేందుకు చేసిన సాహసం, పాత్ర గురించి వివరించనుంది.

కాగా సోషల్ మీడియాలో నిఖిల్ అద్వానీ రిలీజ్ చేసిన టీజర్‌లో.. భయంకరమైన దాడుల నడుమ ఆస్పత్రిలో నెలకొన్న గందరగోళ పరిస్థితితో పాటు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు, నర్సుల తాపత్రయాన్ని చూడొచ్చు. ఈ టీజర్ ద్వారా ముంబై టెర్రర్ ఎటాక్ హీరోలకు ఘన నివాళులర్పించిన నిఖిల్.. అంతులేని మంచితనమున్న ఆత్మలకు అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ సిరీస్ చేసేందుకు చాలా మంది తమ భుజాలపై తనను మోసుకువెళ్లారని.. కానీ ఇదంతా ప్రారంభించింది అద్భుతమైన తమ రచనా బృందం అంటూ వారికి అభినందనలు తెలిపారు.

26/11 ఎటాక్ నేపథ్యంలో చాలా స్టోరీస్ వచ్చినా.. వైద్యుల కోణంలో ఎవరు చూపించలేదన్నారు. తమ సిరీస్ ద్వారా ఇదే చూపించబోతున్నామని, ప్రమాదం ఏర్పడినప్పుడు మానవ ఆత్మను విజేతగా నిలబెట్టే వైద్యుల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే లక్ష్యంగా తెరకెక్కించినట్లు చెప్పారు నిఖిల్ అద్వానీ. 2021 మార్చిలో ముంబై డైరీస్ 26/11 అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story