కేంద్రం నిధులిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం దారిమళ్లిస్తోంది : ఎమ్మెల్యే సీతక్క

by Shyam |
కేంద్రం నిధులిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం దారిమళ్లిస్తోంది : ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, ములుగు : కేంద్రం నుంచి వచ్చిన నిధులను గ్రామ పంచాయతీలకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న సీతక్క ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగట్టారు. ములుగు నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.15,738 కోట్లను మంజూరు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం వాటిని దారి మళ్లించిందన్నారు.

ప్రభుత్వ వేధింపులు భరించలేకే..

చిన్న చిన్న గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీసం వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని.. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఇద్దరు, ముగ్గురు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితిని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు పూర్తి చేసినప్పటికీ బిల్లులు రాక, చేసిన అప్పులు పెరిగిపోయి సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాల్లో భాగంగా ములుగును జిల్లాగా ప్రకటించిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా మల్లంపెల్లిని మండలం చేస్తానని మాట ఇచ్చారని, దీనిని ఆనుకోని 15 గ్రామాలు ఉన్నాయని.. సుమారు 30 వేల మంది నివసిస్తున్న మల్లంపల్లిని మండలంగా ప్రకటించాలని కోరారు. అంతేకాకుండా మంగపేట మండలంలోని రాజుపేటను మండలముగా ప్రకటించాలన్నారు.

పేదల భూములను లాక్కుంటున్నారు..

హరితహారం పేరుతో గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన పోడు భూములను లాక్కుంటున్నారని, గత 60 ఏండ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల భూములను ఫారెస్ట్ అధికారులు బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొ్న్నారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం వైకుంఠధామాల పేరుతో భూములను బలవంతంగా లాక్కోవడం ఏంటని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి కంపా నిధులు సుమారు 600 కోట్ల రూపాయలు ఇస్తే వాటిని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story