కేసీఆర్ సూపర్ ప్లాన్.. హుజురాబాద్ TRS అభ్యర్థి ఫిక్స్.?

by Sridhar Babu |   ( Updated:2021-06-18 08:16:47.0  )
Muddasani Purushottam Reddy
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌లో ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ అధిష్టానం భారీ కసరత్తే చేస్తోంది. టీఆర్ఎస్ గెలవడం కన్నా ఈటల ఓటమినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ బాస్.. అభ్యర్థి అన్వేషణపై సీరియస్‌గా దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు నాయకుల గురించి ఆరా తీయించిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో క్యాండిడేట్‌‌‌పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీటీడీఏ) వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పురుషోత్తం రెడ్డి గురించి గ్రౌండ్ లెవల్లో సమాచారం సేకరించిన ఇంటెలిజెన్స్ సీల్డ్ కవర్‌ను సీఎంకు పంపించింది.

తమ్ముని వారసుడిగా..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీయిస్తున్న పురుషోత్తం రెడ్డి.. కమలాపూర్ నుంచి నాలుగు సార్లు ప్రాతినిథ్యం వహించిన దామోదర్ రెడ్డికి స్వయానా అన్న కావడం విశేషం. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పురుషోత్తం రెడ్డి ప్రస్తుతం వీటీడీఏ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్.. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు పురుషోత్తం రెడ్డి.. మహబూబ్ నగర్ కలెక్టర్‌గా పని చేశారు. అటు దామోదర్ రెడ్డి అన్నగా ఇటు అధికారిగా కూడా కేసీఆర్‌కు వ్యక్తిగతంగా పురుషోత్తం రెడ్డి పరిచయస్థులు. దీంతో ఆయననే ఈ ఉప ఎన్నికల్లో ఆభ్యర్ధిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న సమాలోచనలు చేస్తున్నారు.

సింపతి కలిసొస్తుందా?

ఇకపోతే ముద్దసాని కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పోటీ చేయిస్తే దామోదర్ రెడ్డిపై ఉన్న సింపతి కలిసొస్తుందా.? అన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. మొదట దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చింది. ఆయన టీఆర్ఎస్‌లో చేరేందుకు కూడా సమాయత్తం అయ్యారు. కానీ.. అనూహ్యంగా కశ్యప్ పెద్ద నాన్న పురుషోత్తం రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే సీఎం కేసీఆర్ మరిన్ని కోణాల్లో కూడా ఆలోచిస్తున్నట్టగా తెలుస్తోంది. 2004లో దామోదర్ రెడ్డిని ఓడించిన రాజేందర్‌పై ముద్దసాని కుటుంబాన్ని పోటీ చేయిస్తే సానుకూల ఫలితాలు వస్తాయా లేదా అని కూడా తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Next Story