టీమ్ఇండియాకు ధోని ఫీవర్

by Shyam |   ( Updated:2020-06-03 11:03:48.0  )
టీమ్ఇండియాకు ధోని ఫీవర్
X

దిశ, స్పోర్ట్స్: 28 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని వన్డే వరల్డ్ కప్‌ను అందించాడు. టీ20 వరల్డ్‌కప్‌ను సైతం సాధించి పెట్టాడు. ఎంతో మంది యువక్రికెటర్లను ప్రోత్సహించాడు. అతడి కారణంగా భారత జట్టులో చోటు సంపాదించి క్రికెట్‌లో పాతుకొనిపోయిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే, టీమ్‌ఇండియా కెప్టెన్ అయిన తర్వాత ధోని తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు అతని కెరీర్‌కు కూడా అడ్డం పడుతున్నాయి. గత ఏడాది వరల్డ్‌కప్‌ సెమిస్‌లో న్యూజిలాండ్‌తో ధోని ఆడిందే చివరి మ్యాచ్. ఆ తర్వాత అతను ఇండియా జట్టుకు దూరంగానే ఉన్నాడు. అప్పటి నుంచి అతడి పునరాగమనంపై చర్చ జరుగుతూనే ఉంది. ఐపీఎల్ 13వ సీజన్ ద్వారా తనను తాను నిరూపించుకొని తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెడదామని అనుకున్నా కరోనా వైరస్ కారణంగా టోర్నీ వాయిదా పడటంతో అతడి రిటైర్మెంట్‌పై మళ్లీ చర్చ మొదలైంది. గత వారంలో #DhoniRetires అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. అయితే, అతని భార్య సాక్షి మాత్రం ఆ ట్రోలింగ్‌పై ఘాటుగానే స్పందించింది. అంతేకాకుండా ఎంతో మంది క్రికెటర్లు ధోనికి మద్దతు పలికారు.

బెస్ట్ ఐపీఎల్ టీంకు ఎంఎస్ ధోనినే కెప్టెన్‌

ధోని తర్వాత ఎక్కువ కాలం జట్టుకు దూరంగా ఉన్న ఆటగాడు హార్దిక్ పాండ్యానే. వెన్నునొప్పి కారణంగా కొన్ని వారాలుగా ఆటకు దూరంగా ఉన్న అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ, ఆ ద్వైపాక్షిక సిరీస్ అర్ధాంతరంగా రద్దయ్యింది. తాజాగా తన బెస్ట్ ఐపీఎల్ ఎలెవెన్ టీంను హార్ధిక్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న అతను అనూహ్యంగా తన బెస్ట్ ఐపీఎల్ టీంకు ఎంఎస్ ధోనినే కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు జట్టులో చోటు మాత్రం కల్పించాడు. తనను మొదటి నుంచి ప్రోత్సహించింది ధోని అని, అతని కెప్టెన్సీ తనకు ఎంతో నచ్చుతుందని పాండ్యా చెప్పాడు.

ధోనిని మిస్ అవుతున్నా

ఇక ధోనీ వల్ల జట్టులో చోటు స్థిరపరుచుకున్న మరో ఆటగాడు మహ్మద్ షమి. తాజాగా ఒక ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో తనకు ధోనితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్‌లో మినహా తన కెరీర్ మొదటి నుంచి ధోని సహచర్యంలో ఆడుతున్నానని చెబుతున్నాడు. ధోని చాలా పెద్ద ఆటగాడు, అతనితో కలసి ఆడటం ఎంతో సరదాగా ఉంటుందని చెప్పాడు. చివరిసారిగా ప్రపంచకప్ సెమీస్‌లో అతనితో కలసి ఆడాను. అప్పటి నుంచే అతణ్ని మిస్ అవుతున్నాను. ధోని ఎప్పుడూ ఒంటరిగా ఉండే వ్యక్తి కాదు. అతని చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఎన్నోసార్లు అతనితో సమయం గడిపాను. ఇప్పుడు అవన్నీ తలచుకుంటే బాధగా ఉంది. అతను త్వరలోనే జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

అందరిదీ అదే మాట

ధోనిని సాగనంపే సమయం ఆసన్నమైందని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. గతంలో గంగూలీ, సచిన్, లక్ష్మణ్, సెహ్వాగ్ వంటి క్రికెటర్ల వల్ల జట్టుపై భారం పడుతోందని, తనకు యువ జట్టును ఇస్తేనే కెప్టెన్సీ చేస్తానని సెలెక్టర్లతో చెప్పాడు. ఇప్పుడు ధోని కూడా జట్టుకు భారమయ్యాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కేవలం సలహాలు సూచనలకైతే వికెట్ కీపర్‌గా ఉండటం ఎందుకు? కోచ్‌గా మారొచ్చు కదా అని మాజీ క్రికెట్లు అంటున్నారు. అతను ఇక క్రికెట్ ఆడలేడని, అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడం అసాధ్యమని స్వయంగా హర్బజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, లక్ష్మణ్ కూడా అలాగే వ్యాఖ్యానించారు. కానీ, టీమ్ఇండియా సభ్యులు మాత్రం ధోని తిరిగి జట్టులోకి రావాలని కోరుకుంటున్నారు. కోహ్లి, రోహిత్ శర్మ కూడా అతను ఉంటే జట్టుకు అదో బలం అని చెప్పారు. మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కూడా ధోనీ వైపే మాట్లాడాడు. ఆట నుంచి ఎప్పుడు వైదొలగాలో అతనికి తెలిసినంత ఎవరికీ తెలియదు అన్నాడు. అయితే, తన రిటైర్మెంట్‌పై ఇంత చర్చ జరుగుతున్నా ధోని మాత్రం ఎప్పటిలాగే నోరు మెదపట్లేదు. తన మాటతో కాకుండా ఆటతో అందరి నోర్లూ మూయించాలని ఎదురు చూస్తున్నట్లు అతని చిన్నప్పటి కోచ్ చెబుతున్నారు. మరి త్వరలోనే ఐపీఎల్ జరిగే సూచనలు కనిపిస్తుండటంతో ఇప్పుడు అందరి కళ్లూ ధోని వైపే చూస్తున్నాయి.

Advertisement

Next Story