బ్యాటింగ్‌కు దిగిన ప్రతీసారి భయపడతాను : ధోనీ

by Shyam |
బ్యాటింగ్‌కు దిగిన ప్రతీసారి భయపడతాను : ధోనీ
X

దిశ, స్పోర్ట్స్ :

క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సైతం బ్యాటింగ్‌కు దిగిన కాసేపటిదాకా భయపడతాడంటా. ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పాడు. ‘ప్రతీ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన తర్వాత మొదటి 5 నుంచి 10 బంతులు ఎదుర్కోవడానికి కాస్త భయపడతాను. ఆ సమయంలో నా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయి, చాలా ఒత్తిడికి గురవుతాను. కానీ ఎప్పుడైతే బంతులను అంచనా వేయడం ప్రారంభిస్తానో ఇక బ్యాట్ ఝులిపించి నా భయాన్ని తగ్గించుకుంటానని’ ధోనీ వెల్లడించాడు. ఈ అనుభవం ప్రతీ బ్యాట్స్‌మన్‌కు ఎదురయ్యేదే కానీ ఎవరూ ధైర్యంగా ఆ విషయాన్ని బయటకు ఒప్పుకోరని అన్నాడు. ఆటగాళ్లకు మానసిక ధృఢత్వంతో పాటు మెళకువలు పెంచే ఉద్దేశంతో సీఎస్కే జట్టు ఆటగాడు ఎస్. బద్రినాథ్ ‘ఎంఫోర్’ అనే సంస్థను స్థాపించాడు. దీని ప్రారంభోత్సవం సందర్భంగా ధోనీ ఆటగాళ్ల మానసిక స్థితిపై చర్చించాడు. ఇండియాలో మానసిక బలహీనతలను బయటకు చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ దాన్ని మానసిక బలహీనత అనకుండా మానసిక రోగం అని భావించడమేనని ధోనీ అన్నాడు.

ఆటగాళ్లు ఎదుర్కునేది చాలా చిన్న సమస్యే అయినా కోచ్‌లతో చర్చించడానికి ముందుకు రారు. దీనివల్ల ఆటగాడి కెరీర్‌కే నష్టమని ధోనీ చెప్పాడు. కోచ్, ఆటగాడి మధ్య ఎంత మంచి సంబంధం ఉంటే ఆటపై అంత చక్కని ప్రభావం చూపిస్తుందని అన్నాడు. ఇక ‘ఎంఫోర్’ సంస్థను ప్రారంభించిన ఎస్. బద్రినాథ్ మాట్లాడుతూ.. మానసిక స్థితిపై కోచింగ్ సంస్థను ప్రారంభించాలని గత 10 నెలలుగా కష్టపడి ఈ రోజు అందరి ముందుకు తీసుకొని వచ్చామన్నాడు. మా దగ్గర 25 మంది మైండ్ కోచ్‌లు, స్పోర్ట్స్ సైకాలజిస్టులు ఉన్నారని చెప్పాడు. క్రీడాకారులకు చక్కని మానసిక స్థితిపై శిక్షణ ఇవ్వడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని చెప్పాడు.

Tags: Cricket, Mind Coaching, FOR, S. Badrinath, MS Dhoni, CSK, Sports Psychologists

Advertisement

Next Story