పార్లమెంట్​లో ఇవే మాట్లాడబోతున్నాం : ఉత్తమ్​

by Shyam |
పార్లమెంట్​లో ఇవే మాట్లాడబోతున్నాం : ఉత్తమ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, మిషన్ భగీరథ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని, దేశంలో ఇప్పటి వరకు ఈస్థాయి అవినీతి ఎక్కడా జరుగలేదని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుల అక్రమాలపై సీబీఐ ఎంక్వయిరీ వేయించేందుకు కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తామని, పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని లేవనెత్తుతామని ఉత్తమ్ ప్రకటించారు. కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్యనేతలు గాంధీభవన్‌లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్​ చేస్తున్న దోపిడిని పార్లమెంట్​లో ప్రస్తావిస్తామని, మూడు అంశాలను ప్రధానంగా చర్చిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో వేల కోట్లు దోచుకుంటున్నారని, బీజేపీ నేత బండి సంజయ్​… సీఎం కేసీఆర్​ అవినీతిపై మాట్లాడుతున్నాడని అన్నారు. కానీ ఇంతవరకూ లిఖితపూర్వకంగా కేంద్రానికి బండి సంజయ్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్రించారు. బీజేపీ, టీఆర్​ఎస్​ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని, రాష్ట్రంలో అవినీతి జరిగిందని సీఎంపై విమర్శలు చేస్తారని, కానీ ఢిల్లీలో విచారణ కోసం ఎందుకు అడగడం లేదని, దీనిపై నిలదీస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రకాల అవినీతిపైనా సీబీఐ విచారణ కోసం పార్లమెంట్​లో ప్రశ్నిస్తామని ఉత్తమ్​ వివరించారు.

కోవిడ్ వ్యాక్సిన్ మందుగా సీఎం కేసీఆర్ ఎందుకు తీసుకోలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇక హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని కోరుతామని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలని పార్లమెంట్​లో డిమాండ్ చేస్తామని, ఐటీఐఆర్ మీద నిలదీస్తామని, భువనగిరిలో ఎయిమ్స్‌పై ఎందుకు జాప్యం జరుగుతుందో అడుగుతామని ఉత్తమ్​ వెల్లడించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీ‌ఆర్‌లు సమర్పించకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా నిధులు ఇచ్చారో కేంద్రాన్ని నిలదీస్తామని, మైనారిటీ, ట్రైబల్ రిజర్వేషన్ల‌ను సీఎం కేసీఆర్ ఎందుకు సాధించడం లేదన్నారు. సీఎం ఆ రెండు వర్గాలకు క్షమాపణ చెప్పాలని, పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టులపై పార్లమెంట్‌లో అడుగుతామన్నారు. మెట్రో సంగారెడ్డి వరకు పొడిగించాలని కోరుతామని, సింగరేణి కాలరీస్‌లో కల్వకుంట్ల కుటుంబం ప్రమేయంతో పెద్ద కుంభకోణం జరిగిందని ఈ సందర్భంగా ఉత్తమ్​ పేర్కొన్నారు. అదే విధంగా సమ్మక్క, సరక్క జాతరను జాతీయ పండగగా ప్రకటించేందుకు పార్లమెంట్​లో ఒత్తిడి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను వివరిస్తామని, కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని కేంద్రం… సీఎంకు చెప్పిందా అని ప్రశ్నించారు. ఐకేపీ కేంద్రాలు, సహాకార సంఘాల ద్వారా మద్దతు ధరలకు పంట ఉత్పత్తులను అమ్ముకునేవారని, వాటిని ఎత్తివేస్తే రైతులు ఇబ్బందులు పడుతారని, రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి తీసుకువస్తామని ఉత్తమ్​ చెప్పారు.

అవినీతిని నిరూపిస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ చేస్తున్న అవినీతిని మొత్తం ఆధారాలతో పార్లమెంట్​లో నిరూపిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి ఆధారాలు అమిత్ షా, సీబీఐకి సమర్పిస్తామని, 2014లో వాళ్ల ఆస్తులు ఎంతున్నాయి, ఇప్పుడు ఎంతకు పెరిగాయి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆదాయాలు ఎలా పెరిగాయో వివరాలున్నాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కల్వకుంట్ల కుటుంబం మొత్తం దోచుకుంటుందని, ప్రపంచంలో ఇంతస్థాయిలో కరప్షన్​ ఎక్కడా లేదన్నారు. ఈ అవినీతిపై దమ్ముంటే విచారణ జరిపించాలని, ఎందుకు విచారణ జరిపించడం లేదో పార్లమెంట్‌లో నిలదీస్తామని వెంకట్​రెడ్డి అన్నారు.

Advertisement

Next Story