తిరుమలకు రేవంత్ రెడ్డి.. వెంకన్న ఆశీర్వాదంతో..!

by Shyam |
తిరుమలకు రేవంత్ రెడ్డి.. వెంకన్న ఆశీర్వాదంతో..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చీఫ్‌గా రేవంత్​రెడ్డి బాధ్యతల స్వీకరణకు ఓ వైపు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు నేతలను స్వయంగా కలిసి ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించిన రేవంత్.. సోమవారం బెంగళూరుకు వెళ్లి రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక పీసీసీ చీఫ్​డీకే శివకుమార్​లను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇక టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకునే ముందు ఆయన తిరుమలకు వెళ్లి మొక్కులు సమర్పించుకోనున్నారు. ఉదయం తిరుపతికి వెళ్లి రాత్రి వరకు తిరిగి రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు గాంధీభవన్‌లో వాస్తు మార్పులు పూర్తి కావొస్తున్నాయి. పీసీసీ చాంబర్, తూర్పు గేటు మార్పు వంటి పనులన్నీ జరుగుతున్నాయి. మంగళవారం వరకు గాంధీభవన్‌ను సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే గాంధీభవన్‌కు కాంగ్రెస్​ నేతల తాకిడి పెరిగింది. రేవంత్​నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్​కనిపిస్తోంది. రేవంత్​పదవీ బాధ్యతల కార్యక్రమానికి జిల్లాల నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందింది. పార్టీ సీనియర్లు, ప్రజాప్రతినిధులకు స్వయంగా ఫోన్లు చేసి చెప్పారు.
ఈ నెల 7న టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతరులు బాధ్యతల స్వీకరణ ఉంటుందని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ సోమవారం తెలిపారు. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని, రేవంత్ బృందం జూబ్లీహిల్స్‌లోని పెద్థమ్మతల్లి ఆశీస్సులు తీసుకుని ర్యాలీ‌గా గాంధీ భవన్‌కు వస్తారని చెప్పారు. మధ్యలో యూసుఫ్ బాబాను దర్శించుకుంటారని, రోడ్లపైన ఎవరికీ ఇబ్బంది కలుగకుండా కార్యకర్తలు వ్యవహరించాలన్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ నేతలకు సహకారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమానికి రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు హాజరవుతారని దాసోజు శ్రావణ్ తెలిపారు.

Advertisement

Next Story