- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరి తాళ్ళు: రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్ళు అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించేలా చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి అత్యవసర అసెంబ్లీ పెట్టేలా వత్తిడి తేవాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టాలను రద్దు చేసేలా డిమాండ్ చేయాల్సిందేనన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇందిరా పార్కు దగ్గర శనివారం చేసిన ఒక రోజు దీక్షకు హాజరై ఆయనకు సంఘీభావం తెలిపిన సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ… వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీ శివారు ప్రాంతంలో 45 రోజులుగా చలిలో దీక్షలు చేస్తున్నారని అన్నారు. దాదాపు నలభై మంది రైతులు చనిపోయినా ప్రధాని మోడీకి చలనం లేదని వ్యాఖ్యానించారు.
రైతులకు సంఘీభావంగా కాంగ్రెస్ హైదరాబాద్‌లోనూ దీక్షలు చేస్తూ ఉంటే తొలుత చట్టాలను వ్యతిరేకించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కేంద్రానికి వంత పాడుతున్నారని ఆరోపించారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల సూచనలను పెడచెవిన పెట్టి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. రైతులు కష్టపడి ఉత్పత్తి చేస్తున్న పంటలకు ధరలను కార్పొరేట్ శక్తులు నిర్ణయిస్తున్నాయని, కనీస మద్దతు ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేస్తే ఇప్పుడు దానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు.
నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకునే హక్కును రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే కార్పొరేట్లకు నిల్వ చేసుకునే హక్కును బీజేపీ ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శించారు. దీంతో ఏ పార్టీ రైతు పక్షమో స్పష్టమవుతోందన్నారు. పార్లమెంటులో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కొట్లాడితే మరో ప్రత్యామ్నాయం లేక టీఆర్ఎస్ కూడా తమ వెనక పిల్లిలాగా వచ్చిందని, రైతులు తలపెట్టిన ‘భారత్ బంద్’కు తమ పార్టీ మద్దతు పలికితే టీఆర్ఎస్ అనివార్యంగా రావాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ బంద్‌కు మద్దతు పలికిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత హఠాత్తుగా తన వైఖరిని మార్చుకున్నారని, ప్రధాని మోడీ దగ్గర మోకరిల్లారని, గులాంగిరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పటివరకూ నెలకొల్పిన కొనుగోలు కేంద్రాలను రద్దు చేశారని ఆరోపించారు.
సేద్యం చేస్తున్నవారిలో 90 శాతం మంది చిన్న సన్నకారు రైతులేనని, వారు పండించిన పంటలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్ముకోగలరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల పంటలను కొనుగోలు చేసినందుకు రూ. 7,500 కోట్లు నష్టం వచ్చిదంటూ కేసీఆర్ చెప్పడం రైతుల్ని అవమానించడమేనని, అది ప్రజల సొమ్మేనని అన్నారు.