రూటు మార్చిన ఎంపీ రఘురామ.. జగన్ సర్కార్‌కు మరో ఝలక్

by srinivas |   ( Updated:2021-06-09 07:34:17.0  )
Cm Jagan, MP Raghurama
X

దిశ, ఏపీ బ్యూరో : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రూటు మార్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపైనా, తన అరెస్ట్ తదనంతర పరిణామాలపై కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేసిన ఆయన ప్రస్తుతం నేరుగా జగన్ సర్కార్‌ని చిక్కుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని.. రివర్స్ టెండరింగ్ పేరుతో అంచనాలు పెంచి నిధులు కాజేస్తోందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఫిర్యాదు చేశారు.

బుధవారం ఎంపీ రఘురామ గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. నిర్వాసితుల పేరుతో నకిలీ ఖాతాల్లోకి డబ్బు జమవుతోందని.. అసలు నిర్వాసితులను పక్కన పెట్టి నకిలీలకే నిధులు జమవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రివర్స్ టెండరింగ్ పేరుతో అంచనాలు పెంచి అదనపు నిధులు కేటాయిస్తున్నారని.. కంపెనీల నుంచి 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు వివరించారు.

అలాగే తనపై రాజద్రోహం కేసు నమోదు చేశారని, విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపై విమర్శల దాడి చేసిన రఘురామ ఏకంగా కేంద్రమంత్రికి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ ఫిర్యాదు చేయడం పట్ల రాజకీయంగా దుమారం రేపుతుంది. మరి ఈ ఫిర్యాదుపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story