ఎన్నికలయ్యాక భైంసాను మేం కాపాడుకుంటాం : బండి

by Shyam |
ఎన్నికలయ్యాక భైంసాను మేం కాపాడుకుంటాం : బండి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం భైంసాను తాము కాపాడుకుంటామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని గురువారం ఆయన పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బాలికపై అత్యాచారానికి పాల్పడటం అమానుషం అని అన్నారు. మైనర్ మీద అఘాయిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అల్లర్లలో భాగంగా ఓ వర్గానికి చెందిన కొందరు తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని భైంసాలో ఇటీవల పలుమార్లు కమ్యూనిటీ గొడవలు జరిగినప్పటికీ, పోలీసులు ఓ వర్గానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భైంసాను ఎంఐఎం చేతిలో పెట్టారని, దాంతో ఓ వర్గం కావాలనే తరచూ అల్లర్లకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. జర్నలిస్టులు, పోలీసులపై దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత భైంసాను మేము కాపాడుకుంటామని బండి సంజయ్ స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed