డ్రగ్స్ కేసులో మరో సంచలనం.. హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ పోలీసుల సోదాలు

by Javid Pasha |   ( Updated:2023-09-19 05:35:06.0  )
డ్రగ్స్ కేసులో మరో సంచలనం.. హీరో నవదీప్ ఇంట్లో   నార్కోటిక్ పోలీసుల సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాదాపూర్ డ్రగ్స్ కేసు గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఈ కేసులో టాలీవుడ్ నుంచి హీరో నవదీప్‌తో పాటు నిర్మాత ఒకరు పట్టుబడటం గుబులు రేపుతోంది. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఇప్పటికే పోలీసులు తేల్చగా.. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని అతడి ఇంట్లో నార్కోటిక్ బ్యూరో టీమ్స్ సోదాలు నిర్వహించింది. నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేయడంతో పాటు వాటిని అతడు తీసుకున్నట్లు కూడా విచారణలో బయటపడిన నేపథ్యంలో నార్కోటిక్ పోలీసులు సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది.

కొనుగోలు చేసిన డ్రగ్స్ నవదీప్ ఇంట్లో ఎక్కడైనా దాచిపెట్టాడా? అనే అనుమానంతో నార్కోటిక్ పోలీసులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ సోదాలు జరిగే సమయంలో నవదీప్ ఇంట్లో అందుబాటులో లేరని తెలుస్తోంది. సోదాలు చేసిన పోలీసులకు ఎలాంటి డ్రగ్స్ ఇంట్లో దొరకలేదని తెలుస్తోంది. అయితే నవదీప్ స్నేహితుడు రామ్‌చంద్‌ను ఇప్పటికే పోలీసులు విచారించగా.. తనతో పాటు నవదీప్ కూడా డ్రగ్స్ సేవించినట్లు అతడు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అతడి స్టేట్‌మెంట్ ఆధారంగా నవదీప్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా పోలీసులు చేర్చారు.

నవదీప్‌ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ ఇటీవల హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. కానీ దీనిపై నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో మంగళవారం వరకు అతడిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Read More..

ఆ డ్రగ్ మత్తులో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు.. షకీలా సంచలన కామెంట్స్

Advertisement

Next Story