Mr bachchan: ‘మిస్టర్‌ బచ్చన్‌’ రివ్యూ.. ఈసారైనా రవితేజ హిట్ కొట్టేనా?

by Anjali |   ( Updated:2024-08-15 15:51:52.0  )
Mr bachchan: ‘మిస్టర్‌ బచ్చన్‌’ రివ్యూ.. ఈసారైనా రవితేజ హిట్ కొట్టేనా?
X

దిశ, సినిమా: రవితేజ కథానాయకుడిగా.. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'మిస్టర్‌ బచ్చన్‌'. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రీమియర్‌ షోస్‌ బుధవారం సాయంత్రం మొదలయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మిస్టర్‌ బచ్చన్‌ ప్రేక్షకులను నిరాశపరిచింది. హిందీలో అక్షయ్‌కుమార్‌ నటించిన రైడ్‌ చిత్రానికి రీమేక్‌గా మిస్టర్‌ బచ్చన్‌ను తెరకెక్కించారు హరీశ్‌ శంకర్‌. అయితే రైడ్‌ కథను పూర్తిగా మార్చేసి తనదైన శైలిలో రొమాంటిక్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలన్న హరీష్‌శంకర్‌ ప్రయత్నం ఫలించలేదు. ఆసక్తికరంగా లేని కథ, కథనాలతో మిస్టర్‌ బచ్చన్‌ను బోరింగ్‌ సినిమాగా తయారుచేశాడు దర్శకుడు. రొటిన్‌ సన్నివేశాలతో.. నవ్వురాని కామెడీతో ఎటువంటి లాజిక్‌ లేకుండా చిత్రాన్ని రూపొందించాడు.

ఏ సన్నివేశం ఎందుకు వస్తుందో తెలియకుండానే ఫస్ట్ హాప్‌ పూర్తవుతుంది. ఇక సెకండాఫ్‌ సినిమా మొత్తం చూడాలంటే ఖచ్చితంగా ప్రేక్షకుడికి పరీక్షే. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి దానికి లాజిక్‌గా సమాధానమిచ్చే హరీష్‌ శంకర్‌, ఎటువంటి లాజిక్‌, మీనింగ్‌ లేకుండా కొన్నిసన్నివేశాలు తెరకెక్కించడం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లను ఎదో కుటీర పరిశ్రమ పెట్టుకున్న వ్యక్తులుగా చూపించారు. హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సేను కేవలం గ్లామర్‌కే పరిమితం చేసి ఆమె పాత్రను మలిచిన విధానం ఆకట్టుకోదు. కథ మీద కాన్‌సన్‌ట్రేషన్ లేకుండా హీరోను, హీరోయిన్‌ను హైలైట్‌ చేయడమే పనిగా పెట్టుకుంటే కథ పక్కదారి పడుతుంది అనడానికి మిస్టర్‌ బచ్చన్‌ ఒక ఉదాహరణ. రొటిన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement

Next Story