గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు.. చావుబతుకుల్లో ఉన్న వీరాభిమాని పిల్లల్ని దత్తత

by Kavitha |   ( Updated:2024-06-20 06:35:27.0  )
గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు.. చావుబతుకుల్లో ఉన్న వీరాభిమాని పిల్లల్ని దత్తత
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాల్లోనే కాకుండా సమాజంలో మంచి పనులు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. తన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే 1000కి మంది చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా నిలిచాడు. ఎవరికైనా కష్టం ఉందంటే ముందుగా ఉండి వారికి అండగా ఉంటాడు.

ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు వీరాభిమానికి సహాయం చేశాడు. మోపిదేవి పెదప్రోలులో కాకర్లమూడి రాజేష్ అనే వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణకు, మహేష్ బాబుకు వీరాభిమాని. అతనికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజేష్‌కి మహేష్ బాబు మీద ఉన్న పిచ్చి ప్రేమతో తన ముగ్గురు కొడుకులకు కూడా మహేష్ బాబు సినిమాల పేర్లే పెట్టుకున్నాడు. రాజేష్ మొదటి కుమారునికి అర్జున్ అని రెండో కుమారునికి అతిథి అని ఇక మూడో కుమారునికి ఆగడు అని పేర్లు పెట్టుకున్నాడు. అయితే రాజేష్ ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్ అయి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అందులోనూ పేద కుటుంబం కావడంతో పిల్లలు చదువు మానేసి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెద్ద కొడుకు చెప్పుల షాపులో పని చేస్తూ ఇంటిని నెట్టుకొస్తున్నాడు. అయితే ఈ విషయం ఆ పిల్లలు చదివే స్కూల్ ప్రిన్సిపాల్‌కి తెలియడంతో మహేష్ అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ విషయం మహేష్ బాబుకి తెలియడంతో మహేష్ బాబు ఫౌండేషన్ టీమ్ పెదప్రోలుకు వచ్చి రాజేష్ పిల్లలు అర్జున్, అతిథి, ఆగడులను మోపిదేవిలోని ఓ స్కూల్‌లో జాయిన్ చేయించి డబ్బులు కట్టారు. అంతే కాకుండా ప్రతి సంవత్సరం మహేష్ బాబు నుంచే డబ్బులు వస్తాయని.. వాళ్ళని చదివించే బాధ్యత మాదే అని ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కి తెలియజేశారు. దీంతో మహేష్ బాబు చేసిన ఈ మంచి పనికి అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story