'నాటు నాటు' సాంగ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-11 14:25:06.0  )
నాటు నాటు సాంగ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్‌ఆర్‌ఆర్ తెలుగుతో పాటు భారతదేశ సినీ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిచిన విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా క్రేజ్ సంపాదించింది. 2021లో విడుదలైన ఈ సాంగ్ సంచలనం స‌ష్టించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల స్టెప్పులను ఖండంతరాల్లో అనుకరిస్తూ వీడియోలు పోస్ట్ చేశారు. అయితే ఈ సినిమాలోని 'నాటు నాటు' సాంగ్‌కి ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో మళ్లీ వార్తల్లో నిలిచింది.

ఈ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో చిత్ర బృందం ఎంతో శ్రమించింది. ఈ విషయాలను గతంలో రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ఓ స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేశామని.. అయితే ఈ పాటను యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లోని అధ్యక్షుడి భవనంలో చిత్రికరీంచామన్నారు. ఆ ప్యాలెస్ పక్కనే ఆ దేశ పార్లమెంట్ భవనం ఉందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ టెలివిజన్ యాక్టర్ కావడంతో తాము అడగగానే సాంగ్ షూట్‌కి పర్మిషన్ ఇచ్చారని తెలిపారు.

100 కి పైగా స్టెప్స్‌.. 18 టేక్‌లు

ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరాలు అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు తమ గానంతో పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు. అయితే మూడు నిమిషాల పాట కోసం డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ టీమ్ 100 కి పైగా సిగ్నిచర్ స్టెప్స్‌ను రికార్డు చేసింది. చివరకు భుజాలపై చేతులు వేసుకుని ఇద్దరు ఒకేలా కాళ్లు కదిలించే స్టెప్‌ను ఫైనల్ చేశారు. డ్యాన్స్ స్టెప్ పర్‌ఫెక్ట్‌గా రావడానికి మొత్తం 18 టేక్‌లు తీసుకున్నారట. సినిమాల్లో డ్యాన్స్‌లతో అదరగొట్టే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై 18 టేక్‌లు తీశారంటే పర్‌ఫెక్ట్‌గా రావడానికి ఎంతలా కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. కాగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లోనూ ఉత్తమ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకుంది.

యూట్యూబ్‌లో రికార్డుల మోత

ఈ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులను నెలకొల్పింది. విడుదలైన 24 గంటల్లో 10.4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో ఈ రికార్డ్ క్రియేట్ చేసిన ఫస్ట్ మూవీగా నిలిచింది. అన్ని భాషల్లో కలిపి 48 గంటల్లోనే 20 మిలియన్ల(2కోట్ల) వ్యూస్ సొంతం చేసుకుంది.

Advertisement

Next Story