Eye Drops: కలుషితమైన ఐ డ్రాప్స్‌తో మరణాలు.. EzriCare ఆర్టిఫిషియల్ టియర్స్‌ను బ్యాన్ చేసిన యూఎస్

by Prasanna |   ( Updated:2023-03-28 06:22:15.0  )
Eye Drops: కలుషితమైన ఐ డ్రాప్స్‌తో మరణాలు.. EzriCare ఆర్టిఫిషియల్ టియర్స్‌ను బ్యాన్ చేసిన యూఎస్
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఐ డ్రాప్స్ కళ్ల సమస్యలు ఉన్నవారికి డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. కళ్లకలక, కళ్లల్లో వివిధ రకాల ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీటివల్ల ఉపశమనం కలుగుతుంది. కానీ యూఎస్‌లో అందుకు భిన్నంగా ఒక బ్రాండ్ కంపెనీకి చెందిన ఐ డ్రాప్స్ ఇన్ ఫెక్షన్లను తగ్గించకపోగా మరింత పెంచుతున్నాయి. అవి కొందరి మరణానికి కూడా దారితీశాయి. దీంతో యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆ ఐ డ్రాప్స్ ఉత్పత్తి చేయడం నిలిపివేయాలని హెచ్చరించింది. దానిని వాడకూడదని ప్రజలకు సూచించింది. ఇలా ప్రకటించిన తర్వాత కూడా మరో ఇద్దరు వ్యక్తులు ఐ డ్రాప్స్ వాడటం మూలంగా చనిపోయారు.

మార్చి 14 నాటికి, 16 యూఎస్ రాష్ట్రాలలో 68 మంది రోగులు సూడోమోనాస్ ఎరుగినోసా బాక్టీరియం(bacterium Pseudomonas aeruginosa.) అనే కళ్లకు సంబంధించిన అంటు వ్యాధివల్ల బాధపడుతున్నారు. ఇటీవల కొందరు మృత్యువాత పడగా 8 మంది దృష్టిని కోల్పోయారు. మరో నాలుగు కేసులకు సంబంధించిన బాధిత వ్యక్తులకు శస్త్రచికిత్స ద్వారా కనీసం ఒక కన్ను తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే గ్లోబల్ ఫార్మా అనే భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ ద్వారా ఉత్పత్తి చేయబడిన EzriCare ఆర్టిఫిషియల్ టియర్స్ వాడటంవల్లనే కళ్లకల వ్యాధి, ఇన్ఫెక్షన్లు మరింత వ్యాపించి మరణాలకు దారితీస్తోందని అమెరికన్ సీడీసీ గుర్తించి దానిని బ్యాన్ చేసింది.

పి.ఎరుగినోసా (P. aeruginosa) అనేది ఒక రకమైన బాక్టీరియా. ఇది జెట్ ఇంధనం నుంచి మనిషి స్వేదనజలం వరకు ఎక్కడైనా వృద్ధి చెందుతుంది. యూఎస్‌లో కంటి కలక వ్యాధికి ప్రస్తుతం ఇది కూడా ఒక కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే EzriCare ఐ డ్రాప్ వాడటం మూలంగా ఇన్ఫెక్షన్లు, మరణాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు, సీడీసీ హెచ్చరికల నేపథ్యంలో ఇండియన్ గ్లోబల్ ఫార్మా యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు తమ ప్రొడక్ట్‌ను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. యూఎస్‌లో విస్తరిస్తున్న కళ్ల కలక వ్యాధి వ్యాప్తికి, తమ ఉత్పత్తి అయిన EzriCare ఐ డ్రాప్‌కు సంబంధం లేకపోయినప్పటికీ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చేసిన సిఫార్సును అనుసరించి స్వచ్ఛందంగా తమ ఐ డ్రాప్స్ బ్రాండ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు యూఎస్ గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ నిపుణులు ప్రకటించారు.

Advertisement

Next Story