డ్రగ్స్ కేసులో కదలిక.. సినీ నటులకు ఈడీ నోటీసులు

by Sumithra |
drugs case
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో మళ్లీ ఒక్కసారిగా కదలిక వచ్చింది. దర్యాప్తు జరిపిన కమిటీ గత నెలలో కోర్టుకు ఛార్జిషీట్లను సమర్పించగా ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకావాల్సిందిగా సినీ నటులకు నోటీసులు జారీచేసింది. మాదకద్రవ్యాల వినియోగంతో ఈడీ విచారణకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో ఆర్థికపరమైన అంశాలను ఈ విచారణ సందర్భంగా ప్రశ్నించనున్నది. ఈ నెల 31వ తేదీన సినీ దర్శకుడు పూరీ జగన్నాధ్‌ను ప్రశ్నించడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభం కానున్నది. సెప్టెంబరు 22వ తేదీ వరకు పలువురు నటీనటులను విచారించనుంది. మొత్తం పన్నెండు మందికి నోటీసులను జారీ చేసింది. ఏ రోజు ఎవరు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందో కూడా పేర్కొన్నది.

ఆ ప్రకారం పూరీ జగన్నాధ్ ఆగస్టు 31న, నటి ఛార్మి సెప్టెంబర్ 2, రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6, దగ్గుబాటి రాణా సెప్టెంబర్ 8, రవితేజ సెప్టెంబర్ 9, శ్రీనివాస్ సెప్టెంబర్ 9, నవదీప్ సెప్టెంబర్ 13, ఎఫ్ క్లబ్ జీఎం సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ సెప్టెంబర్ 15, తనీష్ సెప్టెంబర్ 17, నందు సెప్టెంబర్ 20, తరుణ్ సెప్టెంబర్ 22 తేదీల్లో హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడీ పేర్కొన్నది. ఎక్సైజ్‌ శాఖ 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తు చేపట్టనున్నది.

Advertisement

Next Story