రిజిస్ట్రేషన్ ఫీజులు, వినియోగ ఛార్జీలు పెంపు.. నేటి నుంచే అమల్లోకి

by Anukaran |   ( Updated:2021-09-01 23:48:10.0  )
TS Govt
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయమార్గల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఫీజులతో పాటు వినియోగ ఛార్జీలు, ఆ శాఖ ద్వారా అందించే వివిధ సేవల రుసుములను పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. పెంచిన ఛార్జీలు నేటి నుంచి(గురువారం) అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సొసైటీల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు, చిట్‌ఫండ్‌లకు సంబంధించిన ఛార్జీలు కూడా పెరిగాయి. ఇటీవల వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు, స్టాంపు డ్యూటీనీ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందించే వివిధ సేవల ఫీజులను భారీగా పెంచింది. గతంలో సొసైటీ రిజిస్ట్రేషన్‌ ఛార్జీ రూ.500 ఉండగా తాజాగా రూ.2 వేలకు పెరిగింది. సొసైటీల డాక్యుమెంట్ల ఫైలింగ్‌కు గతంలో రూ.300 ఉన్న మొత్తాన్ని తాజాగా రూ.1000కి పెంచారు. అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌, జీపీఏలకు గతంలో రూ.2 వేలు ఉండగా తాజాగా కనిష్ఠం రూ.5000గా గరిష్ఠంగా లక్ష రూపాయలు వరకూ నిర్ణయించారు. ఇంటివద్ద రిజిస్ట్రేషన్‌ చేసే రుసుం గతంలో వెయ్యి రూపాయలు ఉండగా ఇప్పుడు రూ.10000కు పెరిగింది.

Advertisement

Next Story