దారుణం : కళ్లెదుటే బాలిక దారుణ హత్య.. తన కూతురే అని తెలుసుకోలేకపోయిన తల్లి..!

by Sumithra |   ( Updated:2021-07-16 03:58:05.0  )
దారుణం : కళ్లెదుటే బాలిక దారుణ హత్య.. తన కూతురే అని తెలుసుకోలేకపోయిన తల్లి..!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికను 21ఏళ్ల వ్యక్తి పరుగెత్తించి మరీ గొడ్డలితో నరికి చంపాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి వీక్షించిన మహిళ చంపబడేది తన కూతురే అని గుర్తించలేకపోయానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. సౌత్ ఢిల్లీలోని బస్తీలో భార్యాభర్తలు ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. వారి పెద్ద కూతురికి 15ఏళ్లు. తెల్లారితే 16వ పుట్టినరోజు జరుపుకునే బాలికను ప్రదీప్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఇతను గత ఎనిమిది నెలలుగా బాలికతో గొడవ పడుతున్నట్లు సమాచారం. బాలికను ఆ వ్యక్తి నుదిటిపై గొడ్డలితో నరుకుతున్నప్పుడు ఆమె తల్లి కొంత దూరంలో నిలబడి చూసింది. కానీ, ఆ సమయంలో దాడికి గురైంది తన కూతురే అని గుర్తించలేకపోయినట్లు ఆవేదన వ్యక్తంచేసింది.

పార్కుకు అవతలి వైపు ఒక అమ్మాయిని వెంబడించడం చూశానని.. అప్పుడు తాను బట్టలు ఆరబెడుతున్నట్లు వివరించింది. తన కూతురు సహాయం కోసం పిలిచి ఉండవచ్చు, కేకలు పెట్టి ఉండవచ్చు. కానీ నేను ఆమెను రక్షించలేకపోయానని వెల్లడించింది. ఇదిలా ఉండగా, దక్షిణ మోతీ బాగ్ మార్కెట్ సమీపంలో బాధితురాలి కుటుంబం ఓ పండ్ల దుకాణం నడిపిస్తున్నారు. అక్కడే ఈ బాలికకు ప్రదీప్ స్నేహితులకు మధ్య వివాదం తలెత్తినట్లు బాధిత కుటుంబం తెలిపింది.

అంతకుముందు నుంచే తమ కూతురు మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటుందని, అతన్ని పలుమార్లు ఎదుర్కొన్నదని చెప్పారు. కాగా, ఈ ఘటన అనంతరం నిందితుడు ప్రదీప్‌ను హర్యానా రాష్ట్రం పాల్వాల్‌లోని తన సోదరి ఇంటి వద్ద ప్రదీప్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాలికపై దాడికి ఒక నెల ముందు అతను ఆర్కె పురంలోని మార్కెట్‌లో గొడ్డలిని కొనుగోలు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నైరుతి) ఇంగిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఏదేమైనా తన కూతురిని పొట్టనబెట్టుకున్న నిందితుడిని ఉరితీయాలని బాధిత తల్లి డిమాండ్ చేసింది.

Advertisement

Next Story