పిచ్ అధ్వానంగా ఉంది.. ఫిర్యాదుకు సిద్ధమైన ఇంగ్లాండ్

by Shiva |
పిచ్ అధ్వానంగా ఉంది.. ఫిర్యాదుకు సిద్ధమైన ఇంగ్లాండ్
X

దిశ, స్పోర్ట్స్ : సాంప్రదాయ టెస్టు మ్యాచ్ అప్పట్లో 6 రోజుల పాటు ఆడేవాళ్లు. మూడు రోజులు ముగిసిన తర్వాత క్రికెటర్లు అలసిపోతారని ఒక రోజు విశ్రాంతి దినంగా ఉండేది. ఆ తర్వాత మిగిలిన రెండు రోజులు క్రికెట్ ఆడేవాళ్లు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్ వచ్చిన తర్వాత టెస్టు మ్యాచ్‌లను చూడటానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. టీ20 వచ్చాక వన్డే మ్యాచ్‌లు కూడా ఎవరూ అంత ఆసక్తిగా చూడటం లేదు. కానీ.. ఈ మధ్య టెస్టులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా అక్కడ ఆడిన తీరు చూసి టెస్టు మ్యాచ్‌లను ఎంతో మంది ఫాలో అవుతున్నారు. కానీ, ఇండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా గెలవడానికి పిచ్‌లు మాత్రమే దోహదపడ్డాయని ఆరోపణలు రావడంతో బీసీసీఐ మేల్కొన్నది. ఇంగ్లాండ్ జట్టు చేసేవన్నీ నిరాధార ఆరోపణలు అని స్పష్టం చేస్తున్నది.

2 రోజుల మ్యాచ్‌లు ఇవేనా?

టెస్టు మ్యాచ్ అంటే 5 రోజుల పాటు కొనసాగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇరు జట్ల బౌలర్లు విజృంభించిన రోజు మాత్రం అంతకంటే ముందే మ్యాచ్‌లు ముగిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాధారణంగా 3 నుంచి 4 రోజుల్లో ఎక్కువగా మ్యాచ్‌లు ముగుస్తుంటాయి. అయితే 2 రోజుల్లో మ్యాచ్‌లు ముగిసిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. సాధారణంగా 2 రోజుల్లో ముగిసిన మ్యాచ్‌లు అన్నీ ఆతిథ్య జట్లే గెలుస్తూ ఉంటాయి. టెస్టు క్రికెట్‌లో పింక్ బాల్ టెస్టులు (డే/నైట్) మొదలయ్యాక మ్యాచ్‌లు రెండు లేదా మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. టీమ్ ఇండియా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ రోజు బీసీసీఐ పిచ్‌పై ఫిర్యాదు కూడా చేయలేదు. కానీ తాజాగా మొతేరా పిచ్‌పై ఇంగ్లాండ్ జట్టు ఫిర్యాదు చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ఇదీ ఫిర్యాదు..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ అత్యంత అధ్వాన్నంగా ఉన్నదంటూ ఇంగ్లాండ్ జట్టు ఐసీసీ ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నది. బ్రిటిష్ డైలీ అయిన డైలీ మెయిల్ ఈ విషయాన్ని తమ పత్రికలో రిపోర్టు చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ పిచ్‌పై అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నది. పింక్ బాల్ టెస్టుకు రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్‌కు తమ ఫిర్యాదును అందించాలని ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించినట్లు సమాచారం. ‘తమకు పిచ్‌పై చాలా అపనమ్మకాలు ఉన్నాయి. అసలు ఆ పిచ్ అలా ఉంటుందని అసలు ఊహించలేదు. అందుకే ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాము’ అని కోచ్ సిల్వర్‌వుడ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed