మే నెలలో కీలక రంగాల ఉత్పత్తి 18 శాతం వృద్ధి!

by S Gopi |
మే నెలలో కీలక రంగాల ఉత్పత్తి 18 శాతం వృద్ధి!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలకు సంబంధించి ఆర్థిక వృద్ధిని సూచించే ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి 18.1 శాతం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. అంతకుముందు ఏప్రిల్‌లో ఇది 9.3 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉక్కు, సిమెంట్, సహజ వాయువు ఉత్పత్తి మెరుగ్గా ఉండటం వల్లనే కీలక రంగాల్లో ఉత్పత్తి గణనీయంగా వృద్ధి సాధించిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిమెంట్, బొగ్గు, ఎరువులు, విద్యుత్ పరిశ్రమల ఉత్పత్తి గతేడాది మే నెలతో పోలిస్తే ఈసారి అత్యధిక వృద్ధిని నమోదు చేశాయని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. గణాంకాల ప్రకారం, బొగ్గు ఉత్పత్తి 25.1 శాతం, ఎరువులు 22.8 శాతం, సిమెంట్ ఉత్పత్తి 26.3 శాతం, విద్యుదుత్పత్తి 22 శాతం పెరిగింది. అలాగే, ముడిచమురు ఉత్పత్తి 4.6 శాతం పెరిగింది. అంతకుముందు ఏప్రిల్‌తో పోలిస్తే 1.8 శాతం వృద్ధి నమోదైంది. సహజవాయువు సమీక్షించిన నెలలో 7 శాతం పెరిగింది. నెలవారీగా 6.7 శాతం పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తి 16.7 శాతం, ఉక్కు 15 శాతం పెరిగింది.

Advertisement

Next Story