క్రీడా దినోత్సవం.. కనిపించని ఛాంపియన్స్

by Shyam |
క్రీడా దినోత్సవం.. కనిపించని ఛాంపియన్స్
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు మన దేశంలో ఎక్కువ సంఖ్యలో తయారు కావడం లేదు. క్రికెట్‌ను మినహాయిస్తే.. మిగతా క్రీడలన్నీ ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితమయ్యాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఆ ఆటను ఆడే ఆసక్తి ఉన్న వాళ్లే కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లలో భారతీయ క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు.

అయితే భారీ సంఖ్యలో పతాకాలు తేవడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇందుకు ప్రతీ రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ సదుపాయాలు లేకపోవడమే అనే విమర్శలు వస్తున్నాయి. బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ అనగానే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఫుట్‌బాల్ అంటే కేరళ, బెంగాల్‌కు పరిమితం అయ్యింది. బాక్సింగ్, రెజ్లింగ్ వంటి పవర్ గేమ్స్ హర్యాణా, ఈశాన్య రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా ఆడుతున్నారు. కానీ గుజరాత్ నుంచి బ్యాడ్మింటన్ ఛాంపియన్, తమిళనాడు నుంచి రెజ్లర్స్‌గా ఎదగడం లేదు. దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని క్రీడలనే ప్రోత్సహించడం కారణమని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి రాష్ట్ర క్రీడలయ్యాయి..

ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై ఏదైనా క్రీడలో రాణిస్తున్న వారిని చూస్తే.. వాళ్లందరూ ఒక రాష్ట్రానికే చెందిన వాళ్లు ఉంటున్నారు. అథ్లెటిక్స్‌లో ఎక్కువగా కేరళ వాళ్లే రాణించారు. పీటీ ఉష, అంజు బాబీ, షైనీ విల్సన్, బీనామోల్, కేటీ ఇర్ఫాన్ వంటి దిగ్గజాలు కేరళ నుంచే వచ్చారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలంటే బ్యాడ్మింటనే. తొలి తరం ఛాంపియన్స్ బెంగళూరు నుంచి వస్తే ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల షట్లర్లు అంతర్జాతీయ వేదికపై రాణిస్తున్నారు.

ఇందుకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ లభించడమే కారణం. ఇతర రాష్ట్రాలకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు కూడా చివరకు హైదరాబాద్ వచ్చే శిక్షణ తీసుకోవాలి. పంజాబ్ నుంచి హాకీ క్రీడాకారులు, తమిళనాడు నుంచి టెన్నిస్, స్క్వాష్.. హర్యాణా నుంచి రెజ్లింగ్, ఉత్తరప్రదేశ్ నుంచి కబడ్డీ, పశ్చిమ బెంగాల్ నుంచి ఫుట్‌బాల్, ఒడిషా-జార్ఖండ్ నుంచి ఆర్చరీ, మణిపూర్ నుంచి వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడాకారులు వెలుగులోనికి వచ్చారు.

తొలి తరం ఛాంపియన్లు ఆయా రాష్ట్రాల నుంచి ఉండటంతో వాళ్లు వారి రాష్ట్రాల్లో అకాడమీలు ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా వేరే ఆట ఆడాలనుకునే క్రీడాకారులకు తమ రాష్ట్రంలోనే మెరుగైన శిక్షణ దొరకడం లేదు. దేశవ్యాప్తంగా ఏ చిన్న నగరం, పట్టణంలో అయినా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ కోచ్‌లు దొరుకుతారు. కానీ ఫుట్‌బాల్ ఆడాలంటే ఏ గోవా లేదా బెంగాళ్ రాష్ట్రాల్లోని క్లబ్స్‌కు వెళ్లాలి.

ఖేలో ఇండియాతో మార్పు..

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్ ఖేలో ఇండియా గేమ్స్ వల్ల ఈ మధ్య పరిస్థితిలో మార్పు వచ్చింది. 2018లో ప్రారంభించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వల్ల దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభగల క్రీడాకారులను గుర్తించే వీలు కలిగింది. వారికోసం ప్రతీ జిల్లా కేంద్రం, రాష్ట్ర రాజధానుల్లో ఖేలో ఇండియా సెంటర్లు పెట్టి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 2028 ఒలంపిక్స్ నాటికి ఇండియా ప్రతీ క్రీడలోనూ ప్రతిభావంతులను పంపాలనే లక్ష్యంతో ఈ ఖేలో ఇండియా పని చేస్తున్నది.
అంతే కాకుండా మన దేశంలో మరుగున పడిపోతున్న సాంప్రదాయ క్రీడలు, గ్రామీణ క్రీడలకు కూడా ఖేలో ఇండియాలో ప్రాధాన్యత లభిస్తున్నది. కేంద్రం ఈ ఖేలో ఇండియాపై పూర్తి దృష్టి సారించడంతో ఆయా రాష్ట్రాల నుంచి వేరే క్రీడలు ఆడే వాళ్లు కూడా వెలుగులోకి వస్తున్నారు. ఖేలో ఇండియాలో భాగంగా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్ నిర్వహిస్తూ క్రీడా రంగంలో భారత్‌ను బలోపేతం చేస్తున్నారు. చైనా, జపాన్ వంటి దేశాలు చిన్న నాటి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించే విధానాన్ని మన దేశంలో కూడా అమలు చేస్తున్నారు.

రేపు జాతీయ క్రీడా దినోత్సవం..

హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి(అగస్టు 29)నే జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు. భారత దేశ హాకీ చరిత్రంలో ధ్యాన్‌చంద్‌ది ఒక సువర్ణ అధ్యాయం. అతని క్రీడా జీవితంలో మూడు సార్లు హాకీలో ఒలింపిక్ మెడల్స్ సాధించాడు. 1928, 1932, 1936 హాకీ ఒలంపిక్స్ విజయాలు ధ్యాన్ చంద్ వల్లనే సాధ్యమయ్యాయి.

అతడి ఆటలోని స్పూర్తితో ఆ తర్వాత కూడా భారత హాకీ జట్టు ఒలంపిక్స్‌లో రాణించింది. 1928 నుంచి 1964 మధ్య జరిగిన ఎనిమిది ఒలంపిక్స్ క్రీడల్లో ఏడు సార్లు హాకీలో బంగారు పతకాలు సాధించింది. భారతీయ హాకీ మాంత్రికుడిగా పేరొందిన ధ్యాన్ చంద్ 1926 నుంచి 1949 వరకు 185 మ్యాచ్‌లు ఆడి 570 గోల్స్ సాధించారు. 1956లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆయన పుట్టిన రోజునే ప్రతీ ఏటా ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed