బీసీసీఐకి మరిన్ని ఐపీఎల్ కష్టాలు

by Shyam |
IPL-2021
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐకి ఐపీఎల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు. కరోనా కారణంగా ఇప్పటికే 2021 సీజన్ అర్దాంతరంగా వాయిదా పడింది. ఐపీఎల్ 14వ సీజన్‌లో కేవలం 29 మ్యాచ్‌లే జరిగాయి. మిగిలిన 31 మ్యాచ్‌లను పూర్తి చేయడానికి కసరత్తు చేస్తుండటంతో వచ్చే ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌కు సంబంధించిన పలు ప్రక్రియలను వాయిదా వేయాల్సి వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న 8 జట్ల సంఖ్యను 10కి పెంచాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా కూడా ఫ్రాంచైజీలను 10కి పెంచుతామని స్పష్టం చేశారు. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు తెలుస్తున్నది. కొత్త టీమ్స్ కోసం నిర్వహించాల్సిన బిడ్డింగ్ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా బీసీసీఐ అధికార యంత్రాంగం మొత్తం వాయిదా పడిన ఐపీఎల్‌ను కొనసాగింపుపైనే దృష్టి పెట్టింది. కొత్త టీమ్స్ కోసం చేపట్టాల్సిన టెండర్లు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేకుండా పోవడంతో ఐపీఎల్ 2022పై సందిగ్దత నెలకొన్నది.

ఇప్పట్లో లేనట్లే..

ఐపీఎల్ 2022లో అహ్మదాబాద్‌తో పాటు మరో నగరం కేంద్రంగా రెండు కొత్త ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయాలని బీసీసీఐ అపెక్స్ కమిటీ మార్చిలో నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసేలోపు దీనికి సంబంధించిన టెండర్లు పిలుస్తామని ఆనాడే స్పష్టం చేసింది. దీని ప్రకారం మే నెలాఖరు లోపు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ ఐపీఎల్ 2021 అర్దాంతరంగా వాయిదా పడటంతో ఇప్పుడు టెండర్ల ప్రక్రియ కూడా ఆగిపోయినట్లు తెలుస్తున్నది. బీసీసీఐ ఆగిపోయిన ఐపీఎల్ నిర్వహణపైనే దృష్టి పెట్టిందని.. కొత్త టీమ్స్‌కు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ మరో రెండు, మూడు నెలల తర్వాత కానీ ప్రారంభం కాదని తెలుస్తున్నది. అంతే కాకుండా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెగా వేలం కూడా నిర్వహించాల్సి ఉన్నది. వాస్తవానికి గత ఏడాదే మెగా వేలం నిర్వహణ జరగాలి.. కానీ అప్పుడు యూఏఈలో ఐపీఎల్ నిర్వహించడంతో మెగా వేలం బదులు ఈ ఏడాది ఫిబ్రవరిలో మినీ వేలం నిర్వహించారు. కొత్త జట్లు ఏర్పాటు చేశాక మెగా వేలం నిర్వహిస్తామని బీసీసీఐ చెప్పింది. ఇప్పుడు కొత్త టీమ్స్ టెండర్లు ఆలస్యం కావడంతో ఆ మేరకు మెగా వేలం కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

మిగిలిన ఐపీఎల్ కూడా డౌటే..

బీసీసీఐకి ఐపీఎల్ మరిన్ని తలనొప్పులు తీసుకొని వస్తున్నది. ఈ ఏడాది వాయిదా పడిన ఐపీఎల్‌లోని మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణ కూడా కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆతిథ్యం ఇవ్వడానికి ఇంగ్లాండ్, యూఏఈ, శ్రీలంక దేశాలు ముందుకు వచ్చినా.. క్రికెటర్లు ఆడటానికి సిద్దంగా లేరు. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా తమ క్రికెటర్లు జాతీయ జట్టుకే ఆడతారు తప్ప ఐపీఎల్ ఆడబోరని తేల్చి చెప్పారు. అవసరమైతే టీ20 వరల్డ్ కప్‌ను కాస్త వెనక్కు జరిపి ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు ఐసీసీ వద్ద ప్రతిపాదన పెట్టినా.. ఎగ్జిక్యూటీవ్ సభ్యులు దాన్ని తిరస్కరించినట్లు సమాచారం. ఇంగ్లాండ్‌లో ఆడితే కనీసం ఆ దేశ క్రికెటర్లు అయినా ఐపీఎల్‌లో పాల్గొంటారని బీసీసీఐ భావించింది. కానీ ఈసీబీ ఈ ఏడాదికి పూర్తి షెడ్యూల్ ప్రకటించింది. పలు విదేశీ పర్యటనల్లో ఇంగ్లాండ్ క్రికెటర్లు బిజీగా ఉండనున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ కోసం జరుగనున్న సూపర్ లీగ్ షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడకుండా ఇప్పట్లో ఐపీఎల్ నిర్వహించడం కష్టంగా మారనున్నది. ఇన్ని అవాంతరాల నడుమ బీసీసీఐ ఆగిపోయిన ఐపీఎల్ నిర్వహించడం, కొత్త జట్ల టెండర్లు పిలవడం, మెగా ఆక్షన్ ఏర్పాటు చేయడం పెద్ద సవాలే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story