పోస్టాఫీస్ ద్వారా 5 లక్షల మందికి నగదు పంపిణీ

by Shyam |
పోస్టాఫీస్ ద్వారా 5 లక్షల మందికి నగదు పంపిణీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: నిరుపేదల కోసం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు రూ.1500 నగదుతో పాటు ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసి అండగా నిలిచిందన్నారు. శనివారం పౌర సరఫరా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 87.54 లక్షల కుటుంబాలకు గాను ఇప్పటి వరకు 79.57 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా 3 లక్షల 13 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసినట్లు తెలిపారు. 74,07,186 కుటుంబాలకు రూ.1500 చొప్పున రూ.1,112 కోట్లు నగదు బదిలీ చేశామన్నారు. మిగతా కుటుంబాలకు(5,21,641 కార్డుదారులకు) బ్యాంక్ అకౌంట్ లేనందున వీరికి పోస్ట్ ఆఫీస్ ద్వారా నగదును అందిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి శనివారం రూ.78,24,55,500 పోస్ట్ మాస్టర్ జర్నల్, హైదరాబాద్ ఖాతాలో జమ చేసినట్టు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన 3,35,000 మంది వలస కార్మికులను తొలి విడతలో గుర్తించి, ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున మొత్తం రూ. 13 కోట్ల విలువ చేసే 4028 మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున రూ.17 కోట్లు (మొత్తం రూ.30 కోట్లతో) వెచ్చించి కార్మికులను ఆదుకున్నట్టు తెలిపారు. రెండో విడతలో గుర్తించిన 3,12,000 మంది వలస కార్మికులకు రూ.12 కోట్ల విలువ చేసే 3746 మెట్రిక్ టన్నుల బియ్యం, రూ.15.60 కోట్ల నగదును అందించనున్నట్టు చెప్పారు. వలస కార్మికులకు బియ్యం పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల సంస్థ అధికారులను ఆదేశించారు.

Tags : Post Office, Rice Distribution, Migrant workers, Civil supplies chairman

Advertisement

Next Story

Most Viewed