అది సర్కార్ ఆస్పత్రి.. పైసలిస్తేనే కొవిడ్ టెస్ట్ చేస్తరు

by Anukaran |
అది సర్కార్ ఆస్పత్రి.. పైసలిస్తేనే కొవిడ్ టెస్ట్ చేస్తరు
X

దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా వైరస్ పేరిట ప్రైవేటు ఆస్పత్రులు బాధితుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుండగా.. సర్కార్ ఆస్పత్రుల్లో కూడా ఈ తంతు జరుగున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. కొందరు ప్రభుత్వ డాక్టర్లు జేబులు నింపుకునే పనిలో ఉన్నారనే ఆరోపణలు తీవ్రం అయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో కొద్దిరోజులుగా ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సొంతంగా కిట్ తయారీ..

కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. ఆయా సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, పరకాల నియోజకవర్గ కేంద్రంలోని సీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారి స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న అధికారి అక్రమ సంపాదనకు తెరతీశాడు. స్థానికంగా ఏజెంట్లను నియమించుకొని.. వారి ద్వారా తన ఆస్పత్రికి దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్న వారిని రప్పించికుని కరోనా టెస్ట్‌ల పేరిట డబ్బులు గుంజుతున్నట్లు సమాచారం.

ఒక్కో పేషెంట్ వద్ద నుంచి కన్సల్టెంట్ ఫీజు కింద వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తూ కరోనా టెస్ట్‌ల పేరుతో తన విధులు నిర్వహిస్తున్న సీహెచ్‌సీకి రెఫర్ చేస్తున్నట్లు సమాచారం. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మందుల పేరిట డబ్బులు గుంజుతున్నారన్న ఆరోపణలు తీవ్రతరం అయ్యాయి. వాస్తవానికి కరోనా పాజిటివ్ వ్యక్తులకు ప్రభుత్వమే ఉచితంగా మెడికల్ కిట్ (కరోనా కిట్) అందజేస్తోంది. కానీ అక్కడి అధికారి మాత్రం సొంతంగా కిట్‌ను తయారు చేసి ఒక్కో కిట్‌కు రూ.3 వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కడి వారికి అక్కడే కరోనా పరీక్షలు నిర్వహించాలని నిబంధనలు స్పష్టం చేస్తుండగా ఈయన మాత్రం ఉమ్మడి జిల్లాలకు చెందిన వ్యక్తులను సైతం తన వద్దకు రప్పించి టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు పట్టవా?

సర్కార్ నిబంధనలు పట్టని కొంతమంది అధికారుల వైఖరి వైద్య వృత్తికే కలకలం తెచ్చేదిగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరకాల మాదిరిగానే వర్థన్నపేటలో సైతం ఇదే మాదిరి తతంగం నడుస్తున్నట్లు సమాచారం. పరకాల ఆస్పత్రిలో పనిచేస్తున్న అధికారి వర్థన్నపేటలో విధులు నిర్వహిస్తున్న అధికారి శిష్యుడు కావడంతో ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు సైతం అమాయక జనాలను కరోనా లక్షణాలున్నాయని భయబ్రాంతులకు గురి చేసి అక్రమదందాను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పటికే ములుగు జిల్లా కేంద్రంలో పరీక్షలు నిర్వహించకుండానే ఓ వ్యక్తికి ఫలితాలు వెల్లడించిన ఆస్పత్రి అధికారులు, సిబ్బంది తీరు వివాదాలకు కారణమైంది. అంతేగాకుండా ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సేవలు అధ్వానంగా తయారయ్యాయి. రోజుకో ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం ఉద్యోగ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. తోటి ఉద్యోగి కరోనాతో ఆస్పత్రిలో చేరి మృతి చెందాడని.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని నిరసన వ్యక్తం చేశారు. దీనికితోడు ఎంజీఎం ఆస్పత్రి ఆలనా పాలనా చూసుకునే పెద్ద దిక్కు కూడా లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలోని పలువురు అధికారులు అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed