క్రీడాకారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ !

by Shamantha N |
క్రీడాకారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ !
X

కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఫ్యాక్టరీలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ మూతబడ్డాయి. అన్ని రకాల క్రీడా పోటీలు, సినిమా షూటింగులు కూడా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో సామాన్యల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కాగా, దేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు అవగాహన కల్పించే విషయంపై పలువురు ప్రముఖులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం మోడీ దేశంలోని క్రీడా ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజుతో సహా 49 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. కోవిడ్-19 మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తని అభివర్ణించారు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఒలింపిక్స్ వాయిదా పడిన పరిస్థితులే ప్రస్తుతం కూడా ఉన్నాయన్నారు. క్రీడాకారులు మైదానంలో పోరాడి దేశానికి ఎంతో కీర్తిని తీసుకొని వచ్చారు. ఇప్పుడ కరోనాపై పోరాటంలోనూ అదేవిధంగా సహకరించాలని ఆయన కోరారు. సెలెబ్రిటీలు, క్రీడాకారులు చెబితే అభిమానులు తప్పక పాటిస్తారని మోడీ చెప్పారు. మీరు ప్రజలకు ఇచ్చే సందేశాల్లో సామాజిక దూరం పాటించే ‘నిగ్రహం’, వైద్య పోలీసు సిబ్బంది పట్ల ‘గౌరవం’, పీఎం కేర్స్‌కు అందించాల్సిన ‘సహకారం’ గురించి వెల్లడించాలని ఆయన కోరారు. ప్రజలందరూ లాక్‌డౌన్ సమయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించేలా చూడాలని కోరారు.

ఈ కాన్ఫరెన్స్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, అథ్లెట్ హిమదాస్, మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, కబడ్డీ ప్లేయర్ అజయ్ ఠాకూర్, పారా అథ్లెట్ శరద్ కుమార్, చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్, మేరీ కోమ్, అమిత్ పంగాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: PM Modi, Video conference, corona, sportsmen, Ganguly, Sachin, PV Sindhu

Advertisement

Next Story

Most Viewed