ప్రజల హక్కుల రక్షణలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర: మోడీ

by Shamantha N |
PM Modi
X

న్యూఢిల్లీ: ప్రజల హక్కులను కాపాడటంలో దేశ న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని, వ్యక్తిగత స్వేచ్ఛనూ విజయవంతంగా ఎత్తిపడుతున్నదని ప్రధాని మోడీ అన్నారు. ఎప్పటికప్పుడు ఎదురయ్యే కొత్త కొత్త సవాళ్లను సానుకూల దృష్టితో చర్చించి, పరిశీలించి రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నదని వివరించారు. సుప్రీంకోర్టు కరోనా కాలంలోనూ విచారణను ఆపలేదని, వీడియో కాన్ఫరెన్స్‌లో వాదనలు విన్నదని గుర్తుచేశారు. ఆ సంక్షోభ కాలంలో ప్రపంచంలో మరే ఇతర దేశాల అత్యున్నత కోర్టులు విచారించనన్ని కేసులను భారత సుప్రీంకోర్టు విచారించిందని వివరించారు. గుజరాత్ హైకోర్టు 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ న్యాయవ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. పౌరుల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఇతర దేశప్రయోజనాలకు సంబంధించిన సవాళ్లు ముందుకు వచ్చినప్పుడు అందరూ సుప్రీంకోర్టు వైపే చూస్తారని అన్నారు. వాటికి సమర్థవంతంగా న్యాయమందిస్తుందని పౌరులందరిలోనూ నమ్మకమున్నదని వివరించారు. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా న్యాయవ్యవస్థ ఆధునిక మెరుగులను దిద్దుకున్నదని, నేడు దేశవ్యాప్తంగా 18వేల కోర్టులు కంప్యూటరైజ్‌డ్ అయ్యాయని తెలిపారు.

పీఎంపై సుప్రీంకోర్టు జడ్జీ ఎంఆర్ షా ప్రశంసలు

ప్రధాని మోడీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీని మోస్ట్ పాపులర్, వైబ్రంట్, విజనరీగా పొగడ్తలు కురిపించారు. అందరి ప్రేమను చూరగొన్నారని కీర్తించారు. ఆయనతో కలిసి ఈ వేడుకలో పాలుపంచుకోవడంగ గౌరవంగా ఉన్నదని అన్నారు. గుజరాత్ హైకోర్టు ఎల్లప్పుడు న్యాయమైన తీర్పులను వెలువరించిందని తెలిపారు. ఆ న్యాయస్థానం ఎన్నడూ ‘లక్ష్మణ రేఖ’ను దాటలేదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed