గ్రేటర్​లో మొబైల్​ రైతు బజార్లు

by Shyam |
గ్రేటర్​లో మొబైల్​ రైతు బజార్లు
X

దిశ, న్యూస్​బ్యూరో: కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వం లాక్​డౌన్​ ప్రకటించినా.. కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలు పేరిట ప్రజలు బయటకు వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎవరు అవసరానికి వస్తున్నారో తెలియకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. దీంతో పోలీసులపై విమర్శలు వస్తుండటంతో బల్దియా అధికారులు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు.

వ్యవసాయ, మార్కెటింగ్​ శాఖ సమన్వయంతో జీహెచ్​ఎంసీ పరిధిలో శనివారం మొబైల్​ కూరగాయల మార్కెట్లను ప్రారంభించారు. 177 మొబైల్​ వాహనాల్లో దాదాపు 331లోకేషన్లలో తిరిగి కూరగాయల అమ్మకాలు చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు.
దీనిలో భాగంగానే ఏఏ రూట్లలో వాహనాలు ఎప్పుడు వెళ్లాలో అధికారులు ఇప్పటికే షెడ్యూల్​ ప్రకటించారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలెవరూ బయటకు రావద్దని, అందుకే మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తీసుకువచ్చామని అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానంతో మార్కెట్ ధరలకే ప్రజలకు అందుబాటులోకి వచ్చి, ధరలు అదుపులో ఉండటమే గాకుండా మార్కెట్లలో జనాలు గుంపులుగా ఉండటం తగ్గుతుందన్నారు.

మొబైల్​ రైతుబజార్లలో కొనుకోలు చేయండి

ప్రజలెవరూ కూరగాయల కోసం గుంపులుగా బయటకు రావాల్సిన అవసరం లేదు. మీ ఏరియాల్లోకే ఈ వాహనాలు వస్తాయి. కావాల్సిన కూరగాయలు కొని పెట్టుకోండి. నిర్దేశిత ధరలకే అమ్మకాలు జరుగుతాయి. నగరంలోని ప్రజల సౌకర్యార్థం ఈ ప్రయోజనాన్ని కల్పిస్తున్నాం. ప్రజలు రోడ్ల మీద తిరిగి ఇబ్బంది కలిగించొద్దని కోరుతున్నాం

– బొంతు రామ్మోహన్​, నగర మేయర్​

Advertisement

Next Story

Most Viewed