బల్దియాలో ‘ క్రిమేషన్​ ఆన్​ వీల్స్​’

by Anukaran |   ( Updated:2020-07-22 11:38:48.0  )
బల్దియాలో ‘ క్రిమేషన్​ ఆన్​ వీల్స్​’
X

దిశ, న్యూస్​బ్యూరో: హైదరాబాద్ నగరంలో కరోనా మృతదేహాల ఖననం బల్దియాకు ఇబ్బందికరంగా మారుతోంది. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ మృతులు పెరుగుతుండటం, అందుబాటులో ఉన్న దహనవాటికల సంఖ్య సరిపోకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎల్​పీజీ గ్యాస్​తో పనిచేసే ‘ క్రిమేషన్​ ఆన్​ వీల్స్​’ దహన వాటికలను జీహెచ్​ఎంసీ సిద్ధం చేస్తోంది.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గతంతో పోల్చితే పెరిగిపోతోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గాంధీ ఆసుపత్రితో పాటు అనేక ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా చికిత్స కోసం వస్తున్నారు. అందులో కొంతమంది మృత్యువాత పడుతున్నారు. మృతిచెందిన వారందరిని నగరంలోనే వారి వారి సాంప్రదాయాల ప్రకారం బల్దియా ఖననం చేసే బాధ్యతలు తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కరోనా బాధితుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. గ్రామాలకు తీసుకెళ్తే అక్కడ అడ్డుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయి. దీంతో మృతదేహాల అంత్యక్రియల బాధ్యత జీహెచ్​ఎంసీపైనే పడింది. ఈ నేపథ్యంలో మృతదేహాలను తరలించే బదులు, ఎలక్ర్టిక్​ మిషన్​ ద్వారా అంత్యక్రియలు నిర్వహించేందుకు జీహెచ్​ఎంసీ రంగం సిద్ధం చేసింది.

అమీర్​పేటలో ప్రయోగాత్మకంగా..

జీహెచ్​ఎంసీ పరిధిలో విద్యుత్ దహనవాటికలతో పాటు, కట్టెలతో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఇతర ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో మృతదేహాలు మార్చురీల్లోనే నిలిచిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్యాస్ ఆధారిత దహన వాటికలను సిద్దం చేయాలని జీహెచ్​ఎంసీ అధికారులు భావించారు. రూ.7.5లక్షలతో బాక్సులను కొనుగోలు చేసిన జీహెచ్​ఎంసీ అమీర్​పేట శ్మశానవాటికలో మొబైల్ క్రిమేషన్ బాక్సును ప్రయోగాత్మకంగా వినియోగించారు. క్రిమేషన్ బాక్స్‌ను ప్లగ్ ఇన్ మోడల్‌గా ఎక్కడికైనా రవాణా చేసే వెసులుబాటు కలుగుతుంది. సిటీలో మొదటిసారిగా ఈ ‘ క్రిమేషన్​ ఆన్​ వీల్స్​’ను నిర్వహించారు. గత రెండు రోజులుగా జీహెచ్​ఎంసీ ఉన్నతాధికారులు దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షించారు.

ప్రత్యేకంగా తయారు చేసిన ఈ గ్యాస్ దహన వాటికలో ఒక మృతదేహాన్ని దహనం చేయడానికి మూడు గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతున్నాయి. 45నిముషాల నుంచి ఒక గంట సమయంలోపు దహన కార్యక్రమం పూర్తవుతాయి. ఈ ప్రత్యేక వాహనాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకువెళ్లడానికి అవకాశం ఉండటం ఒక అడ్వాంటేజ్ అని అధికారులు తెలిపారు. సులభంగా తక్కువ టైంలో దహనసంస్కారాలు నిర్వహించేందుకు అవకాశం ఉన్న గ్యాస్ అధారిత దహన వాటికలను వీలైనన్ని ఎక్కువగా ఏర్పాటు చేస్తే కొవిడ్ మృతుల ఖననం వేగంగా సాగుతుందని బల్దియా వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడైతే ఎక్కువ మృతదేహాలు ఉంటాయో అక్కడికి వర్షంలో కూడా దీనిని తరలించి అక్కడికక్కడే దహనం చేసే విధంగా వీలు కలుగుతుంది. తక్కువ ఖర్చుతో పాటు తరలింపు కూడా సులభంగా ఉన్నట్టు జీహెచ్​ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. భవిష్యత్​లో వీటి సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు వారు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed