కేసీఆర్ ఇకనైనా వాస్తవాలు తెలుసుకో.. ప్రయోగాలతో రైతులు నష్టపోతున్నరు : జీవన్ రెడ్డి

by Sridhar Babu |
కేసీఆర్ ఇకనైనా వాస్తవాలు తెలుసుకో.. ప్రయోగాలతో రైతులు నష్టపోతున్నరు : జీవన్ రెడ్డి
X

దిశ, కరీంనగర్ సిటీ : గతేడాది సన్న వడ్ల సాగు పేర రైతుల కొంప ముంచిన సీఎం కేసిఆర్, తాజాగా వెదజల్లే పద్ధతి పేరుతో మరోసారి రైతుల పొట్టగొట్టడానికి సిద్దమౌతున్నాడని పట్టభద్రుల శాసన మండలి సభ్యుడు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ధాన్యం కొనుగోలు చేసే రాష్ట్రం ఉందా అని‌ సీఎం కేసీఆర్ మాట్లాడుతుండటం సహేతుకం కాదని, ధాన్యం కొనుగోలు చేయని రాష్ట్రం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు.

దేశం మొత్తం మీద ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని ప్రకటించిన ముఖ్యమంత్రి, మరో పక్క పంజాబ్ రాష్ట్రంలో ఎఫ్‌సీఐ వంద శాతం ధాన్యం కొనుగోలు చేస్తూ తెలంగాణపై వివక్ష చూపుతోందని మాట్లాడుతుండటం రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా కల్లాల వద్దనే ధాన్యం కొనుగోలు చేపట్టారని, హమాలీ చార్జీలు కూడా రూ.16 ఉంటే.. రూ.11 ప్రభుత్వం భరిస్తే, రూ.5 మాత్రమే రైతు చెల్లించాడని, నేడు హమాలీ చార్జీలు రూ.30 నుండి రూ.40 కి పెరగగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపొవడంతో రైతుపై పూర్తి భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల పేరుతో రైతుల నుండి 5 కిలోల దాకా కోత విధిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాలపై రాయితీ ఉండేదని గుర్తుచేశారు. నేడు పచ్చిరొట్ట విత్తనాలపై తప్ప అన్ని రకాల విత్తనాలపై రాయితీని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసిందని మండిపడ్డారు.

నిర్బంధ సాగు పేరుతో గతేడాది రైతులు సన్నవడ్లను మాత్రమే సాగు చేయాలని సీఎం చెప్పడంతో చాలా మంది రైతులు సన్న రకాలను సాగు చేశారు. దీంతో ఎకరాకి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి తక్కువ వచ్చి రైతులు నష్టపోయారని, ఈ యేడాది వెదజల్లే పద్దతిలో వరి సాగు చేస్తే లాభం వస్తుందని, రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల లాభం వస్తుందని చెబుతుండటం వెనుక ఆంతర్యమేంటని అన్నారు. అధికారులు ఆ విధానంలో పంటలు సాగు చేసి రైతులకు చూపించాలని, తక్కువ దిగుబడి వస్తే ఆ మేరకు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వము హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చెప్పినా సరైందే అని తాళం వేసే అధికారులు ఆత్మ పరిశీలన చేసుకుని వ్యవసాయ విధానాలను రైతులకు లాభం వచ్చేలా సీఎంకు వివరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రోమాల రమేష్, గంగాధర మండల, కిషాన్ సెల్ ప్రెసిడెంట్ బుర్గు గంగన్న, చిప్ప చక్రపాణి, కొల ప్రభాకర్, వీరేశం, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed