మంత్రి హరీశ్‌కు ట్రబుల్స్.. సొంత ఇలాఖాలో 'ఓటమి' భయం

by Anukaran |   ( Updated:2021-12-05 06:24:12.0  )
మంత్రి హరీశ్‌కు ట్రబుల్స్.. సొంత ఇలాఖాలో ఓటమి భయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అనే గుర్తింపు ఉన్న మంత్రి హరీశ్‌రావుకు అదే స్థాయిలో ట్రబుల్స్ పెరుగుతున్నాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో తొలి చేదు అనుభవం ఎదురైంది. దానికి కొనసాగింపుగా హుజూరాబాద్ అసెంబ్లీ బైపోల్‌ బాధ్యతలు చేపట్టి సానుకూల ఫలితం సాధించలేకపోయారు. ఇప్పుడు స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ భయం ఆయనను, అధికార పార్టీని టెన్షన్ పెడుతున్నది. అనివార్యంగా క్యాంపు రాజకీయాలు చేయక తప్పడం లేదు. గెలుపుకు అవసరమైనంతగా ఓటర్లు లేకపోయినా కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తున్నది.

ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం హరీశ్‌రావు చెప్పు చేతల్లో ఉంటుందనే అభిప్రాయం పార్టీలో నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డిని గెలిపించుకోవడం ఇప్పుడు ప్రధాన టాస్కుగా మారింది. దీనికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కూడా ఈ జిల్లాలోనే ఉన్నది. ఏకకాలంలో మెదక్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడం ఇద్దరికీ ప్రతిష్టాత్మకంగా మారింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో హరీశ్‌రావు రాజకీయ చతురత, గెలుపు కోసం ఆయన చేసిన కృషి, చివరికి వచ్చిన ప్రతికూల ఫలితం ఎలా ఉన్నా ఇప్పుడు కచ్చితంగా గెలిచి తీరాల్సిందేననే పట్టుదలతో ఉన్నందున దానికి తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేయడం కీలకంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గెలుపు చేజారవద్దని ఇప్పటికే స్పష్టమైన టాస్కు అప్పగించారు.

మూడొంతుల ఓటర్లు ఉన్నా ఆందోళన

ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల కోటా కింద జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలు ఉన్నాయి. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కలిపి ఓటర్లుగా మొత్తం 1062 మంది ఉన్నారు. ఇందులో కొద్దిమంది మృతి చెందగా.. హైకోర్టు కేసుల కారణంగా 47 మంది ఓటర్లకు ఓటు హక్కు లేదు. మిగిలిన 1015 మంది ఓటర్లు ఇప్పుడు అభ్యర్థి గెలుపును నిర్ణయించనున్నారు. పార్టీల వారీగా లెక్కలు తీస్తే.. అధికార టీఆర్ఎస్ పార్టీకి 768 మంది (మరో లెక్క ప్రకారం ఇది 777) ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 230 మంది మాత్రమే. మిగిలినవన్నీ బీజేపీకి చెందినవి. మూడొంతుల మంది ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే అయినా కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉండడంతో క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోననే భయం ఆ పార్టీని వెంటాడుతున్నది. దీంతో వీరందరినీ బెంగుళూరులో క్యాంపుకు తరలించాల్సి వచ్చింది.

కాంగ్రెస్ కేవలం నాల్గింట ఒక వంతు మంది బలమే ఉన్నప్పటికీ అభ్యర్థిని దించే వ్యూహం టీఆర్ఎస్ పార్టీకి గుబులు రేకెత్తిస్తున్నది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చొరవ తీసుకుని పార్టీని ఒప్పించి తన భార్య నిర్మలను అభ్యర్థిగా నిలబెట్టారు. క్యాంపు రాజకీయాలు చేయకపోయినా అధికార పార్టీ నుంచి పలువురిని తనవైపు తిప్పుకుంటారనేది బహిరంగ రహస్యం. జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి ఆకర్షిస్తారని, చివరికి ఇది క్రాస్ ఓటింగ్‌కు దారితీస్తుందనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తానంటూ బహిరంగంగానే జగ్గారెడ్డి కామెంట్ చేశారని ఆరోపిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అధికార టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఒక్కో ఓటు రూ. 50 వేలతో మొదలై చివరకు అది ఐదు లక్షల రూపాయల వరకు చేరుకున్న ఆశ్చర్యం లేదనే వ్యాఖ్యలు ఆ జిల్లాలోని వివిధ పార్టీల నేతల నుంచే వ్యక్తమవుతున్నది.

స్వంత పార్టీవారే.. అయినా తప్పని తిప్పలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఇతర పార్టీకి అవకాశం లేకుండా అన్నింటా అధికార పార్టీ విజయం సాధించింది. అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పోస్టులనూ కైవసం చేసుకున్నది. అయినా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తున్నది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో స్వంత పార్టీవారినే ప్రలోభాలతో, హామీలతో బుజ్జగించాల్సి వచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం స్వంత పార్టీ వారినే కాపాడుకోడానికి అన్ని శక్తులూ ధారపోయాల్సి వస్తున్నది. ఏసీ బస్సుల్లో రిసార్టులకు తరలించి రోజూ లక్షల రూపాయలు ఖర్చు చేసి సంతోష పెట్టక తప్పడం లేదు. స్వంత పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోననే భయమే ఇందుకు కారణం.

దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేనంతటి భారీ సభ్యత్వం ఉన్నదంటూ గొప్పగా చెప్పుకుంటున్నా చివరికి వారి మీదనే నమ్మకం లేకుండా క్యాంపులకు తరలించి ప్రత్యర్థి పార్టీవైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తున్నది. స్వంత జిల్లాలో అభ్యర్థిని గెలిపించుకోవడం హరీశ్‌రావుకు సవాలుగా మారింది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల బాధ్యతల్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న హరీశ్‌రావుకు ఇప్పుడు స్వంత పార్టీ అభ్యర్థి యాదవరెడ్డిని గెలిపించుకోవడం అనివార్యం. స్వంత జిల్లాలోనూ చేదు అనుభవం ఎదురైతే అది ఆయనకు మాత్రమే కాక పార్టీ అధినేతకు కూడా రాజకీయ విమర్శలు ఎదుర్కోడానికి దారితీస్తుంది. అందుకే జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ కూడా క్యాంపుల్లో ఓటర్లకు బ్రెయిన్ వాష్ చేయడంతో పాటు వారు చేజారిపోకుండా దగ్గరుండి చూసుకోవాల్సి వస్తున్నది.

Advertisement

Next Story