- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సారూ.. మీరు క్యాంప్ ఆఫీస్‌లో లేరా ?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ఎమ్మెల్యేలకు అధికార నివాసాలను నిర్మించారు. క్యాంపు ఆఫీస్నుంచే పాలన సాగాలని సూచించారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికార నివాసం వైపు చూడకుండా సొంతింట్లోనే ఉంటుండడం విమర్శలకు తావిస్తోంది. రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన కార్యాలయాలు అలంకార ప్రాయంగా మారాయి. అంతేకాదు.. ఎమ్మెల్యే సారూ ఎక్కడ ఉంటాడో తెలియని దుస్థితి నెలకొంది.
ప్రభుత్వం శాసనసభ్యుల కోసం అధికార నివాసాలు నిర్మించింది. అయితే అధికార భవనంలో ఉంటే తమ డాబు, దర్పం ఎక్కడ దెబ్బతింటుందోనన్న అభిప్రాయం ఎమ్మెల్యేలలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఇప్పటికే అన్ని శాసనసభ్యుల నివాస గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్క ఆదిలాబాద్ మినహా ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్లు ప్రారంభమయ్యాయి. అయితే వారంతా అందులో ఉండకుండా సొంత ఇళ్లలో ఉండేందుకే ఆసక్తిని చూపుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది.
తూర్పున ఒకరు.. పశ్చిమాన మరొకరు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్నిచోట్ల ఇప్ప టికే ఎమ్మెల్యేల అధికార నివాస భవనాలు పూర్తయ్యాయి. ఎనిమిది చోట్ల ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన నివాస గృహాల్లో ఉండడం లేదన్న విమర్శలు ఉన్నా యి. తూర్పు జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధికార నివాస భవనంలో ఉంటున్నారు. ఆయన కుటుంబంతో కలిసి అక్కడే ఉంటూ నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు పశ్చిమ జిల్లాలోని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యాంనాయక్ సైతం అధికార ఎమ్మెల్యే నివాసంలో ఉంటూ కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరిద్దరూ తమ నియోజకవర్గ కేంద్రాల్లో సొంత ఇళ్లు ఉన్నప్పటికీ… ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా అధికార నివాసాలను వినియోగిస్తున్నారు.
అధికార నివాసాలకు దూరం
ఖానాపూర్, కాగజ్నగర్ ఎమ్మెల్యేలు మిన హా మిగతా ఎనిమిది మంది ప్రభుత్వ అధికా ర నివాసాలకు దూరంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. సామాన్య ప్రజలు తమ అవసరాల కోసం ఎమ్మెల్యేల సొంత ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మె ల్యేలు ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా నడుచుకోవడం లేదన్న ఆరోపణలు అవుతున్నాయి. ఒక్కో అధికార నివాసం భవన నిర్మాణం, అందులో ఫర్నిచర్ ఇతర అవసరా లకు అన్నీ కలిపి కనీసం రూ. రెం డున్నర నుంచి మూడు కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కానీ, అధికార నివాసాలను వినియోగించకపోవడం పై సర్వత్రా విమర్శ లు ఉన్నాయి. మరి ఈ శాసన సభ్యులు ఎవరు.. ఎక్కడ ఉంటున్నారు అంటే…
-నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కేంద్రంలోని శాస్త్రి నగర్ లో తన సొంత నివాసంలోనే ఉంటారు. ప్రభుత్వ అధికార భవనం నిర్మాణం పూర్తి అయినప్పటికీ దానిని వినియోగించడం లేదు. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు, అధికారులతో సమావేశాలు మాత్రమే నిర్వహిస్తారు.
-ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కొన్నాళ్లు అధికార నివాసంలోనే ఉన్నారు. ఇప్పుడు నియోజకవర్గ కేంద్రంలో ఉంటే రోజంతా అక్కడే ఉంటారు. ఇటీవల అక్కడి జెడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి సొంత ఇంటికి మారిన తర్వాత ఖాళీ చేసిన ప్రైవేట్ భవనంలో ఉంటున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
– ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ లో తన సొంత ఇంట్లో ఉంటున్నారు. జెడ్పీ క్వార్టర్స్ లైన్లో అధికార ఎమ్మెల్యే నివాస భవనం పూర్తయినప్పటికీ అందులోకి మారలేదు. ఇంకా గృహప్రవేశం చేయలేదు. అధికార భవనం లోకి వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. దీంతో కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉంటున్నది.
– బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదిలాబాద్ జిల్లా సమీపంలోని బట్టి సావర్గాం గ్రామంలో నిర్మించిన తన సొంత ఇంటిలోనే ఉంటారు. ఎమ్మెల్యే నియోజకవర్గం బోథ్ కాగా… ఆయన ఆదిలాబాద్ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. బోథ్ లో అధికార భవనం ఉంది. వారానికి ఒకసారి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తారు. మిగతా రోజుల్లో అక్కడి స్థానిక నాయకులు కొందరు వినియోగిస్తుంటారు.
-ముధోల్ శాసనసభ్యుడు విఠల్ రెడ్డి తన స్వగ్రామం దేగాం లో ఉన్న సొంత ఇంట్లో ఉంటున్నారు. బైంసాలోనూ ఆయనకు సొంత ఇల్లు ఉంది. అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలతో గడుపుతారు. కుటుంమంతా గ్రామంలోనే ఉంటుంది. అయితే గత రెండు నెలలుగా ముధోల్ లోని అధికార భవనాన్ని ఆయన ఎక్కువగా వినియోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
-చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తుంటారు. ఆయన నివాసం హైదరాబాద్ లోనే ఉంటుంది. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మంచిర్యాలలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారు. చెన్నూరులో నిర్మించిన అధికార భవనం ఆయన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాత్రమే వినియోగిస్తారు. కుటుంబంతో సహా ఉండేందుకు ఆసక్తి చూపరు. పార్టీ కార్యక్రమాలు అధికారులతో సమావేశాలు ఇక్కడ జరుపుతారని పేరుంది.
-బెల్లంపల్లి శాసనసభ్యుడు దుర్గం చిన్నయ్య ఆ నియోజకవర్గంలో నిర్మించిన అధికార భవనంలో ఉండేందుకు ఇష్టపడరు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మించుకున్న తన సొంత ఇంటిలోనే ఉంటారు. ఆయన గతంలో రియల్ వ్యాపారిగా వ్యవహరించినప్పుడే సొంతింటిని నిర్మించుకున్నారు. 40 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల నుంచి ఆయన నియోజకవర్గానికి వెళ్తుంటారు. అధికార నివాసం ఎక్కువగా వినియోగించడం లేదన్న విమర్శ ఉంది.