ఎవరేం చేస్తున్నారో అంతా తెలుసు

by Anukaran |
ఎవరేం చేస్తున్నారో అంతా తెలుసు
X

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: మీరేం చేస్తున్నారో అంతా నాకు తెలుసు.. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలే ముఖ్యంగా ప‌నిచేస్తున్నారు.. మీరు ఎక్క‌డెక్క‌డ తిరుగుతున్నారు.. ఎవ‌రెవ‌రికీ వంత పాడుతున్నారో తెలుసు.. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చ‌క‌పోతే మీరెందుకు ఉండి.. నా చేతిలో అధికారులు ఉంటారు.. మీ వ‌ల్ల ప‌నులు కాకుంటే నాతో చెప్పండి.. నేను చేయిస్తాను అంటూ త‌న ప‌రిధిలోని కార్పొరేట‌ర్ల‌కు క్లాస్ తీసుకున్న‌ట్లు తెలిసింది. ఇటీవ‌ల హ‌న్మ‌కొండ‌లోని ఒక ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనే రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు ఈ ర‌హ‌స్య స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు సమాచారం. రాత్రి 8గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ స‌మావేశం తెల్ల‌వారుజాము 3గంట‌ల వ‌ర‌కు సాగిన‌ట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల వేళ అలర్ట్..

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ కార్పొరేట‌ర్లు మరింత జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించాల‌ని సదరు సూచించిన‌ట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కార్పొరేట‌ర్లు ఇంటింటికీ, వాడ‌వాడ‌కు తిరుగుతూ ప్ర‌జ‌ల మొప్పు పొందాల‌ని, లేకుంటే త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించిన‌ట్లు సమాచారం. కొంద‌రు కార్పొరేట‌ర్లు పార్టీ విష‌‌యాల‌ను ప‌క్క వారికి చేర‌వేస్తున్నార‌ని ఇలాంటి వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చ‌రించిన‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికైనా అలాంటి వారు త‌మ ప్ర‌వ‌ర్త‌న మార్చుకోవాలని సూచించిన‌ట్లు తెలిసింది.

17 డివిజన్లలో..

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వర్గంలో మొత్తం 21వ డివిజ‌న్లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నాయి. ర‌హ‌స్య స‌మావేశంలో 21 మంది కార్పొరేట‌ర్ల‌కు గాను 18మంది హాజ‌రైన‌ట్లు తెలిసింది. మ‌రో ముగ్గురు గైర్హాజరు కావ‌డానికి కార‌ణ‌లేంటీ అంటూ ఎమ్మెల్యే ఆరా తీసిన‌ట్లు తెలుస్తోంది. వీరు పార్టీలోనే ఉంటారా లేక మ‌రో పార్టీలోకి దూకుతారా అంటూ స‌మీప కార్పొరేట‌ర్ల‌ను ప్ర‌శ్నించిన‌ట్లు తెలిసింది. ప‌క్క చూపు చూస్తున్న కార్పొరేట‌ర్లు త‌మ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తెచ్చుకోవాలంటూ హెచ్చ‌రించిన‌ట్లు తెలిసింది.

ప్ర‌జాధర‌ణ కోల్పోతున్న కార్పొరేట‌ర్లు..

తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఐదారుగురు కార్పొరేట‌ర్లు ప్ర‌జాధర‌ణ కోల్పోతున్నార‌ని, ఇలాంటి వారికి రానున్న ఎన్నిక‌ల్లో టికెట్ రావ‌డం కూడా క‌ష్టంగా మారుతుంద‌న్నారు. తూర్పు ప‌రిధిలో ఒక్క డివిజ‌న్‌ను కూడా కోల్పోకూడ‌ద‌ని కార్పొరే‌ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్లు తెలిసింది. అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌భుత్వం కోట్లాది రూపాయ‌లు విడుద‌ల చేస్తున్నందున వాటిని ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌ని అప్పుడే విజ‌యం మన ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంద‌ని సూచించినట్లు సమాచారం. అధికారులు నా వెంటే ఉంటారు.. మీరు చెబితే ప‌నులు చేయ‌కుంటే నాతో చెప్పండి.. నేను దగ్గ‌రుండి ప‌నులు చేయిస్తా అంటూ చెప్పిన‌ట్లు తెలిసింది. కాగా, ఎమ్మెల్యే క‌టువుగా మాట్లాడ‌డంతో కొంత‌మంది కార్పొరేట‌ర్లు నొచ్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed