ఎమ్మెల్యే వర్సెస్ చైర్ పర్సన్.. టీఆర్ఎస్‌లో లుకలుకలు

by Anukaran |
Vikarabad
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : గులాబీ పార్టీలో వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మంగళవారం జరగాల్సిన సాధారణ మున్సిపల్ సమావేశానికి అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల గైర్హాజరు కావడంతో సమావేశం వాయిదా వేశారు. అయితే బుధవారం జరగాల్సిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ సమావేశాల వాయిదా పడటానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ మధ్య ఏర్పడిన వివాదం విభేదాలేనని ప్రచారం నడుస్తుంది. ఈ సంఘటనలు ఎటువైపు దారి తీస్తాయని గులాబీ శిబిరంలో కలవరపెడుతున్నాయి. చైర్ పర్సన్ మంజుల రమేష్ ను ఏకాకిని చేయాలన్న లక్ష్యంతో ప్రత్యర్థి వర్గం వ్యూహంగా కనపడుతోంది.

చైర్ పర్సన్ కూడా తనకు అనుకూలంగా ఉన్న కొందరు కౌన్సిలర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. గులాబీ శిబిరంలో తలెత్తిన ఈ మంట ఇప్పట్లో ఆగేటట్లు లేదు. మున్సిపల్ పాలకవర్గంలో తీసుకునే నిర్ణయాలన్ని తమ ఆమోదంతోనే జరగాలని ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే వ్యవహారిస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే అనుచరులు పట్టణంలో వెంచర్లు చేస్తే అనుమతి ఇవ్వడంలో చైర్పర్సన్ జాప్యం చేసినట్లు సమాచారం. అదేవిధంగా మున్సిపల్ అభివృద్ధి పనులను చైర్ పర్సన్ ఇష్టానుసారంగా కేటాయించడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చైర్ పర్సన్ అడ్డుకట్టవేసేందుకు జరిగే సాధారణ సమావేశం బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండాలని తమ అనుచర కౌన్సిలర్ లకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యక్రమం ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్ పర్సన్ కి సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సాధారణ సమావేశానికి హాజరు కాకుండా కౌన్సిలర్ అందర్నీ ఎమ్మెల్యే తన ఇంటిలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూర్చోబెట్టుకోవటం విశేషం. బుధవారం జరిగే బడ్జెట్ సమావేశాలను బైకాట్ చేయాలని ఎమ్మెల్యే అనుచరులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story