మంత్రి హరీశ్ రావుకు.. ఎమ్మెల్యే రఘునందన్ రావు వార్నింగ్

by Shyam |
MLA Raghunandan Rao
X

దిశ సిద్దిపేట: టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేటలో బీజేపీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, తప్పును తప్పు అని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే కేసులు పెడతామనే ధోరణిని మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. సిద్దిపేట కరోనా ఆసుపత్రిలో అవకతవకలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో, ఇతర ఛానల్‌లో వచ్చిన వార్తలు తెలుసుకుని జిల్లా బీజేపీ మహిళా నేతలు ఆసుపత్రిని సందర్శిస్తే.. ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశారని అక్రమ కేసులు పెట్టడం జిల్లా పోలీసులకు తగదని అన్నారు.

ఆస్పత్రి సీసీ కెమెరాలు పరిశీలించి, విచారణ జరిపి కేసులు పెట్టాలని సూచించారు. కానీ, బాధితులకు మనోధైర్యం నింపడానికి వెళ్లిన మహిళా నేతలపై కేసులు పెట్టడం సరైన పద్దతి కాదని అన్నారు. సిద్దిపేట పోలీసులు ప్రతిపక్షాల నోరు నొక్కే కార్యక్రమాలు మానుకోవాలని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు చూసి రోజూరోజుకు బీజేపీ పార్టీకి ఓట్ల శాతం పెరుగుతుందని జీర్ణించుకోలేక నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు చేసి గెలిచిన మంత్రి హరీష్ రావు, బీజేపీ నాయకులను భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకనైనా బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు మానుకోవాలని మంత్రికి, పోలీసులకు రఘునందన్ రావు హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed