అవసరమైతే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..  

by Shyam |
అవసరమైతే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..  
X

దిశ, నాగర్‌కర్నూల్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని.. అత్యధిక శాతం వరిధాన్యం పండిస్తున్న క్రమంలో ఎఫ్‌సిఐ కొనుగోలు చేయకుండా కుట్రకు తెరలేపినట్లు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం చావు డప్పు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి వెంట బిజినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక పై ఆయన మాట్లాడారు.

ఓ కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు, కోడలు ఎవరు చేసే పనులు వారు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ ఒకరు చేసే పని మరొకరు చేయగలరా.? అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు నిరంతర కరెంటు, నీళ్లు, పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తోందన్నారు. కానీ కేంద్రం మాత్రమే వరి కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. కేవలం ఎన్నుకల కోణంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రైతులకు పంచాయితీ పెట్టాలనే కుట్రలు చేస్తోందన్నారు.

గుండు, అరగుండు ల మాటలు నమ్మొద్దని పరోక్షంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై సెటైర్లు వేశారు. బీజేపీ చేసే కుట్రలను ప్రజలకు వివరించేందుకు అవసరమైతే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళతానన్నారు. కొంతమంది పనికిమాలిన సన్నాసులు సోషల్ మీడియాలో కూడా అర్థం లేకుండా ప్రచారాలు చేస్తున్నారని ఆవేశపూరితంగా ప్రసంగించారు.

Advertisement

Next Story