- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాజిక సేవ నుంచి వివాదాల్లోకి ఎమ్మెల్యే!
దిశ, ఆదిలాబాద్: సామాజిక సేవలో అందరికంటే ముందు ఉంటారని పేరున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ శాసనసభ్యుడు కోనేరు కోనప్పను తన కుటుంబసభ్యుల ఆగడాలు వెంటాడుతున్నాయి. ఏటా వేసవిలో సిర్పూర్ నియోజకవర్గంలోని పది చోట్ల అంబలితో ప్రజల ఆకలి తీర్చే ఎమ్మెల్యే కోనప్ప జూనియర్ కాలేజీల పిల్లలకూ మధ్యాహ్న భోజనం అందిస్తారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకూ అంబలి అందిస్తూ సామాజిక కార్యక్రమాలను చేస్తారన్న పేరు సంపాదించారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) ప్రభావం నేపథ్యంలోనూ ఆయన తన నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే, ఇదంతా ఒక పార్శ్వంలాగానే ఉంది. ఎమ్మెల్యే కోనప్ప రెండో పార్శ్వంలో కుటుంబీకుల నుంచి ఆయనకు కొన్నిమరకలు అంటుకుంటున్నాయి. గతంలో ఫారెస్ట్ అధికారిపై ఆయన సోదరుడి ఆధ్వర్యంలో దాడి దుమారం రేగగా, తాజాగా ఆయన తనయుడు ఓ విలువైన భూమిని ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కుటుంబీకుల ఆగడాలతో చెడ్డపేరు..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మారుమూలన ఉన్న సిర్పూర్ నియోజకవర్గం కోనప్ప స్వస్థలం. కార్మిక నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత బీఎస్పీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరడం, మళ్లీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది కొనసాగుతున్నారు. మాస్ లీడర్‌గా పేరుపొందిన కోనప్పకు నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. కానీ, ఆయన కుటుంబీకుల కారణంగా అనేక ఆరోపణలను కోనప్ప ఎదుర్కొంటున్నారు. ఆయన సోదరుడు జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుపై పలు ఆరోపణలు ఉన్నాయి. అనేక వివాదాల్లో ఆయన తల దూర్చుతాడని పేరుంది. జాతీయ స్థాయిలో వివాదమైన అటవీ రేంజ్ అధికారిపై దాడిలో ఆయన ప్రధాన నిందితుడు. ఆ సమయంలో కోనప్ప తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒక దశలో ముఖ్యమంత్రి స్థాయిలో ఈ వివాదం తెరకెక్కింది. దీంతో కొన్నాళ్లు కోనప్ప తీవ్ర మనస్తాపానికి గురయ్యాడన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయన తనయుడు కోనేరు వంశీ కారణంగా ఎమ్మెల్యే కోనప్ప వివాదాల్లో చిక్కుకున్నారు.
విలువైన భూమికి ఎసరు..?
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపల్ కేంద్రంలో ఉన్న అత్యంత విలువైన భూమిలో కోనేరు కోనప్ప కుటుంబం కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఈ స్థలం ప్రభుత్వానికి చెందిన అభిప్రాయం ఉంది. అయితే, ఈ భూమికి పట్టాలు సృష్టించి ఒకరిద్దరు పేర్లపై మార్పిడి జరిగిన తర్వాత కోనప్ప తనయుడు వంశీ పేరిట రిజిస్ట్రేషన్ అయిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి విలువ రూ.పది కోట్లకు పైనే ఉంటుందని చెబుతున్నారు. మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఉండే ఈ స్థలంలో గతంలోనే ఒక ప్రభుత్వ భవనం కోసం మాజీమంత్రి జోగు రామన్న శంకుస్థాపన చేశారని చెబుతున్నారు. ఈ భూమిని కొందరు పత్రాలు చూపి ఇతరులకు అమ్మారని.. ఆ తర్వాత ఎమ్మెల్యే కోనప్ప తనయుడి పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇదంతా భూకబ్జాలో భాగమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం సిర్పూర్-కాగజ్‌నగర్ నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపుతున్నది. కాంగ్రెస్, బీజేపీలు దీనిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. భూమి బదలాయింపు విషయంలో ముందు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే కోనప్ప ముఖ్య అనుచరులని కొందరు ఆరోపిస్తున్నారు.
మానవ హక్కుల కమిషన్ నోటీసులు..
కాగజ్ నగర్ భూవివాదం మానవ హక్కుల కమిషన్‌కు చేరింది. ఈ భూమి ప్రభుత్వ ఆస్తి అని, ఎమ్మెల్యే కోనప్ప తనయుడు అధికార అండతో అక్రమంగా కబ్జా పెట్టాడంటూ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి హరీష్ బాబు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆసిఫాబాద్ కలెక్టర్, కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించింది. జూన్ నెల 19వ తేదీన ఈ కేసును విచారిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. అప్పటిదాకా భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆ వివాదాస్పద స్థలంలో పలు పనులు ఆపేశారు. తాజా పరిణామాలు ఎమ్మెల్యే కోనప్పను ఇరుకున పెట్టేలా తయారవుతున్నాయి. అయితే, ఈ విషయమై కోనప్పను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
Tags: Land disputes, precious, land, Invasion, social service, MLA, Koneru Konappa