కేసీఆర్ పేదల ఉసురు తగిలి పోతావ్.. వాళ్లేమైనా పాకిస్తానీలా: ఎమ్మెల్యే ఈటల

by Shyam |
కేసీఆర్ పేదల ఉసురు తగిలి పోతావ్.. వాళ్లేమైనా పాకిస్తానీలా: ఎమ్మెల్యే ఈటల
X

దిశ, శేరిలింగంపల్లి: కేసీఆర్ నువ్వు పేదల ఉసురు తగిలిపోతావు అంటూ మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి బసవతారక నగర్ భూ బాధితులను మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఎస్ పీఎస్ మాజీ సభ్యుడు విఠల్, ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లెం సాంబయ్య, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు జాలీ, దయ, కనికరం అనేవి ఉండవని, సాధారణ మనుషులంటే ఆయనకు చిన్నచూపని విమర్శించారు. నీ చేతిలో పోలీసులు, అధికారులు ఉన్నారని విర్రవీగుతున్నారని ఏదీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

కేసీఆర్ కు పేదలంటే కనికరం లేదని, మానవత్వం ఉంటే పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ 30 ఏళ్లకు పైగా ఉంటూ రేషన్ కార్డు, ఓటుహక్కు, ఆధార్ కార్డు కలిగి ఉండి, ప్రతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్న వీరు జీఓ నెంబర్ 58లో అప్లై చేసుకున్నా ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదని ప్రశ్నించారు. వీరేమైనా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రజలా.? వారికి కూడా ఆశ్రయం కల్పిస్తున్న తరుణంలో వీళ్లకు ఎందుకు అన్యాయం చేస్తున్నారన్నారు.

మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎన్నో హామీలు ఇచ్చారని ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయని అన్నారు. తెలంగాణ యావత్తు ఈ గుడిసెలకు అండగా ఉంటుందని, బీజేపీ బసవతారక నగర్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గోపన్ పల్లి భూ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story