- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎందుకీ వివక్ష.?
దిశ, తెలంగాణ బ్యూరో :
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఏటా నిర్వహణ ఖర్చులైనా ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మిషన్ భగీరథ పథకంపై ఎర్రమంజిల్‌లోని ఈఎన్సీ కార్యాలయంలో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు.
ప‌్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని రూ.46,123 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టామని తెలిపారు. ఇందులో 80 శాతం నిధులను హడ్కో, నాబార్డుతోపాటు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించామని వివరించారు. ఇప్పటికి రూ.33,400 కోట్లు ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.38 వేల కోట్లతోనే ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ పథకానికి నిధులివ్వాలని సీఎం కేసీఆర్‌తోపాటుగా తాను, ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరామన్నారు. రూ.19 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిందని చెప్పారు. ఇప్పటి వరకు నిధుల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి కదలిక లేదని విమర్శించారు. మిషన్ భగీరథ నిర్వహణకు ఏటా రూ.2,110 కోట్లు అవసరమవుతాయని, కనీసం నిర్వహణా ఖర్చులనైనా ఇవ్వాలని కోరుతున్నా స్పందన లేదని మంత్రి ఎర్రబెల్లి ఆవేదన చెందారు.
‘భగీరథ’ స్ఫూర్తితో
‘మిషన్ భగీరథ’ స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం కూడా ‘జల్ జీవన్ మిషన్’ను పథకాన్ని రూపొందించిందని మంత్రి చెప్పారు. దానికి కావాల్సిన టెక్నాలజీ, ఇంజనీరింగ్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు మన రాష్ట్రానికి ఎన్నోసార్లు వచ్చి అధ్యయనం చేశారని పేర్కొన్నారు. ఇంటింటికి నీళ్లు ఇచ్చే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇటీవల ఇచ్చిన ర్యాంకింగ్‌లో 98 శాతంతో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. కేంద్రం సహా, అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ పథకాన్నే వేర్వేరు పేర్లతో దాదాపు యథాతథంగా అమలు చేస్తున్నాయన్నారు. మార్గదర్శకమైన తెలంగాణ పథకంపై, రాష్ట్రంపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో కేంద్రం చెప్పాలని దయాకర్ రావు డిమాండ్ చేశారు.
మోడీ అభినందించారు
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని గజ్వేల్ సెగ్మెంటులో 2016 ఆగస్టు 7న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. తాగునీటి సరఫరాలో తెలంగాణ ప్రభుత్వం చొరవను మోడీ అభినందించారన్నారు. 2016 మే 22 నాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రస్తావించారని వివరించారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో 23,787 ఆవాసాలకు సురక్షిత మంచినీరు అందిస్తున్నామన్నారు. 18,175 వాటర్ ట్యాంకుల్లో ఇప్పటికి 18,076 పూర్తయ్యాయని, మిగిలిన 99 ట్యాంకులు కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అన్నారు. 124 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా మిషన్ భగీరథ నీరు అందుతోందన్నారు. ఇది వినూత్న పథకం అంటూ హడ్కో మూడు సార్లు అవార్డు అందించిందన్నారు. నీటి వినియోగ సామర్ధ్యం 20 శాతం పెంచినందుకు, జాతీయ వాటర్ మిషన్-2019లో మిషన్ భగీరథకు మొదటి బహుమతి ఇచ్చిందన్నారు. ఆన్లైన్ పర్యవేక్షణలో 2018లో స్కాచ్ అవార్డు లభించిందన్నారు. ప్రధానమంత్రి, నీతి అయోగ్, 15వ ఆర్థిక సంఘంతోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ భగీరథ పథకాన్ని స్వయంగా పరిశీలించి ప్రశంసలు కురిపించారన్నారు.
మిషన్ భగీరథ-జల్ జీవన్ కు తేడాలు
భగీరథ కోసం గోదావరి, కృష్ణా నదుల నీటిని వాడుతున్నామని, జల్ జీవన్ మిషన్ పథకంతో బోర్‌వెల్స్ నీటిని మాత్రమే అందిస్తున్నారన్నారు. ఇక్కడ భూ ఉపరితల నీటిని స్వచ్ఛంగా, ఫిల్టర్ చేసి అందిస్తున్నామని, కేంద్రం ఫిల్టర్ లేకుండా అందిస్తోందన్నారు. దీంతో ఫ్లోరైడ్, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో దీని కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, జల్ జీవన్ మిషన్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.3.60 లక్షల కోట్లు ఖర్చు చేసి, 2024 నాటి కల్లా పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు. దీనిలో కూడా 60 శాతం నిధులు మాత్రమే కేంద్రం భరిస్తుందని, మిగతా 40 శాతం నిధులు రాష్ట్రాలే భరించాలన్నారు. ఈ ఏడాది రూ. 22,813 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. రాష్ట్రంలో 98.4 శాతం గృహాలకు మంచినీరు అందిస్తున్నామని, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పథకం పదేళ్ల క్రితం మొదలైనా ఇప్పటికీ 80 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. గుజరాత్ రాష్ట్రంలో చేపట్టిన ఇదే తరహా పథకానికి 1/3 నీటిని మాత్రమే నర్మదా నది నుంచి తీసుకుంటున్నారని, మిగతా 2/3 నీటిని బోర్‌వెల్స్ ద్వారానే తీసుకుంటున్నరని అన్నారు. జల్ జీవన్ శక్తి పథకం కింద గుజరాత్ కి ఇప్పటి వరకు రూ. 883 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి అడిగిన నిర్వహణా ఖర్చులు కూడా నయా పైసా ఇవ్వలేదన్నారు. ఉత్తరప్రదేశ్ లో 5.78శాతం మాత్రమే పనులు పూర్తి అయ్యాయని, నిధులు మాత్రం రూ. 2,550 కోట్లు కేటాయించారని మంత్రి వెల్లడించారు.