రికార్డుల్లో గందరగోళం.. ఆ బాలిక గర్భానికి కారకులెవరు..?

by Sumithra |   ( Updated:2021-08-17 06:22:33.0  )
nandipet-si
X

దిశ, ఆర్మూర్ : మైనర్ పై అత్యాచారం కేసు ముఖచిత్రం మారింది. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాలిక గర్భం దాల్చడానికి కారణం ఓ యువకుడని నందిపేట పోలీసులు చెబుతుండగా, ఈ కేసుకు సంబంధించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నమోదైన వివరాలు మరోలా ఉన్నాయి. దీంతో నందిపేట్ మండలంలోని ఒక గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలో కేసు మరో మలుపు తిరిగింది. బాలికను ఆస్పత్రిలో చేర్చిన రోజు అక్కడ నమోదైన వివరాలను బట్టి చూస్తే ఈ కేసు విషయం పెద్దది కాకుండా ఉండేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక పేరు, వయసుతో సహా తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరనే విషయాలు బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వెల్లడించారు. ఆస్పత్రి రికార్డుల ప్రకారం విజయ్ రాజ్ అనే వ్యక్తి తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితులు వివరాలు నమోదు చేయించినట్టు సమాచారం.

ఇదే విషయాన్ని సంబంధించిన పోలీస్ బూత్ అధికారులు ఆర్మూర్ సర్కిల్ కార్యాలయం, నందిపేట్ పోలీస్ స్టేషన్‌కు ఇన్ఫమ్ చేసినట్టు రికార్డ్‌లో రాయడం విశేషం. కానీ, తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సంబంధిత నందిపేట ఠాణాలో మాత్రం ఓ బాలికతో చనువుగా ఉన్న యువకుడిని బాధ్యుడిగా ఎఫ్ఐఆర్ లో నమోదైనట్టు తెలిసింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఓ యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని నందిపేట ఎస్సై మంగళవారం పాత్రికేయులకు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చెప్పిన విజయ్ రాజ్ అనే పేరు బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డప్పటికీ కుదరలేదు. విషయం బయటకు పొక్కింది. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఒకరిపై కేసు నమోదవడం, ఆస్పత్రిలో మరో పేరు ఉండటంతో పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ రాజ్ అనే వ్యక్తి నందిపేట మండల కేంద్రంలోని ఓ చర్చిలో పాస్టర్‌గా పని చేస్తున్నాడని, అదే చర్చికి బాలిక కుటుంబం తరుచూ వెళ్లేవారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాస్టర్ కారణంగా బాలిక గర్భం దాల్చినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఉపవాస దీక్షల పేరుతో సదరు బాలికను ఓ గదిలో బంధించి వరుసగా పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చినట్లు బాలిక తల్లి ఆస్పత్రిలో తెలిపినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed