21, 22 ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలి: మంత్రి వేముల  

by Shyam |   ( Updated:2020-05-08 04:28:27.0  )
21, 22 ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలి: మంత్రి వేముల  
X

దిశ, నిజామాబాద్: ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు గోదావరి నీళ్లను లిఫ్ట్ ల ద్వారా తీసుకురావడానికి ఉద్దేశించిన ప్యాకేజ్ 20, 21 పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పిని నింపుతామని చెప్పారు. అందులో భాగంగా ప్యాకేజి 20, 21 పనులు పూర్తయితే ఆర్మూర్ నియోజకవర్గంలో 7వేలు, బాల్కొండలో 80వేల ఎకరాలు, నిజామాబాద్ రూరల్‌‌లో 1లక్ష 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వచ్చే రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తి చేసి నిజాంసాగర్ పాత కెనాల్ లోకి నీటిని లిఫ్ట్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిజాంసాగర్ కెనాల్లో పడ్డ నీటిలో ఒకవైపు, గ్రావిటీ కెనాల్ టన్నెల్ ద్వారా కొండెం చెరువులో పడతాయని తెలిపారు. ప్యాకేజీ 21 పనుల్లో భాగమైన ఈ గ్రావిటీ కెనాల్, టన్నెల్ కూడా రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు..ప్యాకేజి 21-బి లో భాగంగా మెంట్రాస్‌పల్లి పంప్ హౌస్ పనులు 70శాతం పూర్తయ్యాయని అధికారులు తెలుపగా.. మిగతా మొత్తం పనులు జూలై చివరి నాటికి పూర్తిచేయాలని అన్నారు. మెట్‌పల్లి పైపులైన్ పనుల్లో 88కి.మీ ఎంఎస్ పైపులైన్ పనికిగాను 69 కి.మీ ఎంఎస్ పైపులైన్ పని పూర్తయినట్టు అధికారులు తెలిపారు. రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు పైపులైన్ పనులకు ఆటంకం కలిగించొద్దని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ సి.ఈ మధుసూదన్ రావు, ఎస్.ఈ ఆత్మారామ్, సంబంధిత ఈ.ఈ, డీ.ఈలు, వర్క్ ఏజెన్సీ మెగాకన్‌స్ర్టక్షన్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Nizamabad, Minister vemula prashanth reddy, review, 21,22package works

Advertisement

Next Story