సచివాలయ నిర్మాణ పనులు షురూ!

by Shyam |
సచివాలయ నిర్మాణ పనులు షురూ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయం పనులు దాదాపుగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రణాళిక ఖరారు అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సైట్‌ను సందర్శించారు. షాపూర్జీ పల్లోంజీ సంస్థకు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించడంతో పనులను ప్రారంభించడంపై ఆ సంస్థకు చెందిన ఇంజనీర్లు, అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా సచివాలయం ప్రాంగణానికి ఉన్న తెలంగాణ గేటు సమీపంలో ఇటీవల నిర్మించిన కమాన్ వెనక ఈశాన్య భాగంలో ముగ్గు పోసి గొయ్యి తవ్వి లాంఛనంగా పనులను ప్రారంభించారు. ఒకవైపు ఈ కార్యక్రమం జరుగుతుండగానే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అక్కడకు వెళ్ళి పాత భవనాల శిధిలాల తొలగింపు, నేలను చదును చేయడం, కొత్త భవనానికి నిర్మాణ పనులు చేపట్టడానికి ఉన్న తాజా పరిస్థితిపై చర్చించారు.

గతేడాది జూన్ 26న సీఎం కేసీఆర్ పాత సచివాలయం ఉండగానే కొత్త సచివాలయం పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి సీ బ్లాక్, డీ బ్లాక్ మధ్యలో ఉన్న ప్రాంతంలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి కొత్త భవనాల నిర్మాణానికి తొలి పూజ చేశారు. ఇప్పుడు పాత సచివాలయం మొత్తం నేలమట్టం కావడం, ఆ ప్రాంతమంతా చదునుగా మారి కొత్త భవనాల నిర్మాణానికి వీలుగా గ్రౌండ్‌ను సిద్ధం చేయడంతో పనులు ప్రారంభించారు. మంత్రి, సీఎస్ స్వయంగా అక్కడకు వెళ్ళి తాజా పరిస్థితిని అంచనా వేయడం, కొత్త పనులకు ముగ్గుపోయడం ద్వారా ప్రారంభోత్సవం జరగడంతో సీఎం కేసీఆర్ సైతం రెండ్రోజుల్లో అక్కడకు రావొచ్చని అధికారుల సమాచారం.

పన్నెండు నెలల వ్యవధిలోనే కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున 24 గంటలూ పనులు జరిగేలా ఆరు వేర్వేరు పర్యవేక్షణ బృందాలను నియమించనున్నట్టు మంత్రి రెండ్రోజుల క్రితం జరిగిన సమీక్షలో తెలిపారు. పనులు నిరాటంకంగా జరిగి, లక్ష్యం మేరకు పూర్తి కావడం కోసం స్వయంగా తానే ప్రతీవారం అక్కడకు వెళ్ళి పరీశీలిస్తానని మంత్రి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed