అబద్ధాలకోరు నిజామాబాద్ ఎంపీ అర్వింద్: మంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి

by Shyam |
అబద్ధాలకోరు నిజామాబాద్ ఎంపీ అర్వింద్: మంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అబద్ధాలు ఆడటం పరిపాటిగా మారిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సోమవారం వేల్పూర్‌‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందని, రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ మేరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తుందో కూడా తెలియదని, ఒకవేళ ఆ సంస్థ మొత్తం ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 1000 కోట్ల భారం పడుతుందన్నారు. మొక్కజొన్న పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. పొద్దుతిరుగుడు గింజలను (కుసుమలను) కేంద్రం 25 శాతం, రాష్ట్రం 75 శాతం కొనుగోలు చేస్తోందని తెలిపారు. రైతులపైన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అంత ప్రేమ ఉంటే, వరి ధాన్యం కొనుగోళ్ల కోసం తెచ్చిన రూ. 1000 కోట్ల అప్పుకు వడ్డీని మాఫీ చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. ఎంపీ అర్వింద్‌కు అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్‌ కార్డుదారులకు కేంద్రం 5 కిలోల బియ్యం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 7 కిలోలు ఇస్తోందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద రూ. 500 ఇస్తే, సీఎం కేసీఆర్ అదనంగా రూ. 1000 ఇస్తున్నారని మంత్రి వేముల స్పష్టం చేశారు.

tags: minister vemula prashanth reddy, fires on mp arvind, rice purchasing center

Advertisement

Next Story

Most Viewed