గిరిజన హక్కుల కోసం రివ్యూ పిటిషన్

by Shyam |   ( Updated:2020-05-05 05:08:26.0  )

సీనియర్ న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి
రాష్ట్ర గిరిజన సంక్షేమ సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్

దిశ, న్యూస్ బ్యూరో :
రాష్ట్రంలోని గిరిజనుల హక్కులను కాపాడేందుకు సమగ్రమైన పిటిషన్ దాఖలు చేయాలని, అవసరమైతే సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. షెడ్యూల్ ఏరియాలోని టీచర్ పోస్టులను వంద శాతం గిరిజనులతో భర్తీ చేసేందుకు జారీ చేసిన జీఓ ఎం.ఎస్ 3ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసిన నేపథ్యంలో రివ్యూ పిటిషన్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పిటిషన్ తయారీ, కోర్టుకు ఇచ్చిన ఆధారాలపై మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సుప్రీంకోర్టులో రాష్ట్రం తరపున అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ సమర్పించిన ఆధారాలను మంత్రి పరిశీలించారు. సుప్రీం తీర్పు అంశాలను పరిశీలించి రివ్యూ పిటిషన్ వేసేందుకు బలమైన ఆధారాలతో సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే గిరిజన ప్రజా ప్రతినిధులు, నిపుణుల సలహాలు తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ తిరస్కరణకు గురికాకుండా, రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, సంయుక్త సంచాలకులు కళ్యాణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: Telangana, Tribal welfare, satyavathi rathod, supreme court, Law

Advertisement

Next Story

Most Viewed