ఇందులో రాజకీయ ప్రమేయం లేదు

by Shyam |
ఇందులో రాజకీయ ప్రమేయం లేదు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని తిరుమలాపూర్, ముసపేట్ మండల ఘటనలపై దోషులను శిక్షించాలని చెప్పామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, మాఫియాను ప్రోత్సహించాలంటే ఇసుక పాలసీ తెచ్చే వాళ్లమే కాదని స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

2004 నుంచి 2014 దాకా ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.39.66 కోట్లు మాత్రమే వచ్చిందని తెలిపారు. ఇపుడు ఈ ఆరేండ్లలో రూ.3114 కోట్ల ఆదాయం సమకూర్చిందన్నారు. టీఎస్ ఎండీసీకి ఇసుకను అనుసంధానం చేసి పారదర్శకంగా పద్దతి ప్రకారం.. ఇసుక పాలసీ నడుస్తుందన్నారు. మరి మాఫీయా అప్పుడుందా, ఇప్పుడుందా, అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు, మీరా.. మేమా అని ప్రతిపక్షాలను నిలదీశారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా ఎవరినీ ఒదిలిపెట్టమని, తప్పు ఎవరు చేసినా శిక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని స్పష్టం చేశారు.

తెలంగాణాలో వచ్చిన ఏ పథకమైనా, అర్హులైన పేదలకు ఇవ్వాలనేదే మా ధ్యేయమన్నారు. మా రైతుల భూములు పచ్చబడాలని యత్నిస్తున్నామని, ఏ గ్రామంలో ఎవరైనా పేదల జీవితాలతో చెలగాటం ఆడాలని ప్రయత్నిస్తే మాకు తెలపండన్నారు. ఆదాయానికి గండి కొట్టాలని చూస్తే సహించమని, రాజకీయ అంశాలుంటే ఆ కోణంలో మాట్లాడాలి కానీ దిగజారి విమర్శించవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకం నిరుపేదలకు అండగా, వారి కుటుంబాలు ఒకరిమీద ఆధారపడకుండా తమ కాళ్ళమీద నిలబడేలా లబ్ధిచేకూరుస్తుందని వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed