గుడుంబా నివారణకే మద్యం అమ్మకాలు : మంత్రి శ్రీనివాసగౌడ్

by Shyam |
గుడుంబా నివారణకే మద్యం అమ్మకాలు : మంత్రి శ్రీనివాసగౌడ్
X

దిశ, న్యూస్ బ్యూరో :
మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడటంలో ప్రభుత్వ యంత్రాంగం సక్సెస్ అయింది. తొక్కిసలాట, హింసకు తావులేకుండా, పోలీసులు లాఠీలకు పని చెప్పకుండా తొలిరోజు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ సైతం నారాయణగూడలోని కొన్ని దుకాణాలను స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత ఆబ్కారీ భవన్‌లో అధికారులతో సమీక్షించారు. మద్యం ఉత్పత్తి మొదలు స్టాక్ పాయింట్లు, లోడింగ్, మద్యం దుకాణాలకు చేరేంతవరకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు చేశారు. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వాల్సి వచ్చిందో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానం చెప్పారు.

మద్యం అందుబాటులోకి రాకపోతే మళ్ళీ గుడుంబా వచ్చేస్తుందని, ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీనివాసగౌడ్ వివరించారు. గుడుంబా నివారణకు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుందని, ఇందుకోసం గత ఐదేళ్ళలో సుమారు వెయ్యి కోట్లు ఖర్చుపెట్టిందని, ఆ వృత్తిలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించిందని తెలిపారు. కానీ లాక్‌డౌన్ కాలంలో మద్యం లేకపోవడంతో జడ్చర్లలో మళ్ళీ గుడుంబా తయారీ మొదలైందని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ సిబ్బందిపైనా దాడి జరిగిందని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయని, తెలంగాణలో లేకపోవడంతో ఆ రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ అయ్యే అవకాశం ఉందని, ఇక్కడకు తీసుకొచ్చి ఎక్కువ ధరలకు అమ్మే ప్రమాదం ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఇక్కడ కూడా మద్యం అమ్మకాలు ఉండాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.

ఇక్కడ మద్యం లేకపోవడంతో కల్తీ మద్యం కూడా వచ్చేసిందని కొన్ని ఉదాహరణలను పేర్కొన్నారు. గుడుంబా సారాకు రంగు కలిపి విస్కీ పేరుతో విక్రయిస్తున్న సంఘటనలు కూడా తమ దృష్టికి వచ్చాయన్నారు. ఇప్పటివరకు గుడుంబా తయారుచేస్తున్న, తరలిస్తున్నవారిపై 2409 కేసులు నమోదుచేసి 2089 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి దాదాపు 11,130 లీటర్ల గుడుంబాను సీజ్ చేసినట్లు తెలిపారు. అయినా రాష్ట్ర సరిహద్దుల నుంచి లారీల్లో బెల్లం అక్రమంగా రవాణా అవుతూనే ఉందని, కల్తీ మద్యాన్ని ఏదో ఒక బ్రాండ్ పేరుతో ఇక్కడ అమ్ముతున్నారని, దీన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అధికారులు, మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ మద్యం దుకాణాలను తెరవడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు.

ఇన్ని రోజుల పాటు డిస్టిల్లరీలు పనిచేయనందువల్ల తగినంత స్టాక్ లేదనే అనుమానం చాలా మంది నుంచి వ్యక్తమవుతోందని, కానీ అలాంటి కొరత ఏర్పడే అవకాశం లేదని స్పష్టంచేశారు. తగినంత స్థాయిలో నిల్వలు ఉన్నాయన్నారు. పక్క రాష్ట్రంలో 75% ధరలు పెంచితే తెలంగాణ ప్రభుత్వం 16% మాత్రమే పెంచిందన్నారు. అక్కడ మద్యం దుకాణాలు తెరిచిన తర్వాత కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా కష్టసాధ్యమైందని, కానీ ఇక్కడ చాలా పద్ధతిగా, ఎలాంటి గందరగోళం లేకుండా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించని 28 దుకాణాలపై కేసులు నమోదు చేశామని, ప్రస్తుతానికి ఆ దుకాణాలను మూసేశామని, లైసెన్సులను కూడా రద్దుచేస్తామన్నారు. మాస్కులు లేనివారికి మద్యం విక్రయించవద్దని ముందుగానే చెప్పినా ఈ దుకాణాలు పాటించలేదన్నారు.

Tags: Telangana, Minister Srinivas Goud, Wine Shops, liquor Price Hike, Review meeting

Advertisement

Next Story