‘వలస కూలీలను ఆదుకుంటాం’

by Shyam |
‘వలస కూలీలను ఆదుకుంటాం’
X

దిశ, వరంగల్: బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలను ఆదుకుంటామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ వి.పి. గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డిలతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వలస కూలీలకు కల్పించే ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కూలీలు ఉండే గ్రామాల్లోని పాఠశాలల్లో షెల్టర్ ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించాలని మంత్రిని కోరారు. ప్రజాప్రతినిధులు కూడా తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహబూబాబాద్ నుంచి మహారాష్ట్ర వలస వెళ్లే కూలీలను ఆదుకుంటామన్నారు. పట్టణంలో 5వేలకు పైగా వలస కూలీలు ఉన్నారనీ, వారందరికీ వైద్య పరీక్షలు చేయించాలని అధికారులను ఆదేశించారు. కరోనా బారినుంచి తప్పించుకునేందుకు స్వీయ నియంత్రణ తప్పనిసరన్నారు. అంతకుముందు మంత్రి వలస కూలీలను కలిసి, వారి సమస్యలను విన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు దాటకూడడనే ప్రభుత్వ నిబంధనలను వివరించి, వారికి ఉండటానికి పాఠశాలలో వసతి, తినడానికి రెండు క్వింటాళ్ల బియ్యం, వంట సామాగ్రి, పది కుటుంబాలకు రూ.10వేలు వ్యక్తిగతంగా అందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్‌లోని వలస కూలీలందరినీ కంటికి రెప్పలా చూసుకుంటామని హామీనిచ్చారు.

Tags: satyavathi rathod, mahabubabad, meeting, migrant workers, coronavirus, lockdown,

Advertisement

Next Story

Most Viewed