‘వలస’ ఎఫెక్ట్ పై మంత్రి సమీక్ష

by Shyam |
‘వలస’ ఎఫెక్ట్ పై మంత్రి సమీక్ష
X

దిశ, న్యూస్‌బ్యూరో: వలస కార్మికులు సొంతూర్లకు తరలివెళ్లిన ఎఫెక్ట్ అప్పుడే స్టార్టైంది. కార్మికులు(స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్) ఎక్కువ మంది అందుబాటులో లేని ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో నిర్మాణ రంగం ఎలా ముందుకెళ్లాలన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు ప్రారంభించింది. దీనిలో భాగంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం ఎర్రమంజిల్‌లోని తన కార్యాలయంలో రాష్ట్రంలోని పలు కన్‌స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులతో లాక్‌డౌన్ అనంతరం నిర్మాణ రంగం ఎదుర్కోనున్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ తర్వాత నిర్మాణ రంగం పుంజుకోవడానికి ఎన్ఏసీ(న్యాక్) డైరెక్టర్ జనరల్, నిర్మాణ రంగ నిపుణులతో ఎక్స్‌పర్ట్ కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీ రూపొందించిన నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేయాలని కోరారు.

ప్రస్తుతం వలస కార్మికులు ఎక్కువ మంది లేనందున.. రాష్ట్రంలో ఉన్న యువతకు శిక్షణనిచ్చి నిర్మాణ రంగంలో ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. గల్ఫ్ దేశాలు, ముంబై నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే తెలంగాణ కార్మికులను ఇక్కడే ఉపయోగించుకునేందుకు వీలుగా సీఎం ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ జీవన్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, న్యాక్ డీజీ భిక్షపతి, వివిధ నిర్మాణరంగ ఆర్గనైజేషన్లు క్రెడాయ్, ట్రెడా, బీఏఐ, బీఎఫ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

tags: telangana, construction sector, migrant labour effect, minister review

Advertisement

Next Story