వివాదంలో మంత్రి నిరంజన్ రెడ్డి.. నిరుద్యోగులపై సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Anukaran |   ( Updated:2023-03-20 21:06:20.0  )
Minister Niranjan Reddy
X

దిశ, నాగర్ కర్నూల్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులపై చులకన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు ఇవ్వలేం. యాసంగిలో, వానకాలం పంటలో ప్రతిసారి రెండు నెలలపాటు కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ పని పుష్కలంగా దొరుకుతుంది. ఇంతకుమించిన ఉపాధి ఎక్కడ ఉందో చెప్పాలి’’ అని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలను మంత్రి ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఎంపీ రాములు అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. హమాలీలకు వారి సొంత పనులు చేసుకుంటూనే హమాలీ చేసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ‘ఉపాధి అంటే ఇది. ఎంప్లాయిమెంట్ అంటే ఇది’ అంటూ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించి ముసలి కన్నీరు కార్చి యువతను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయని విమర్శించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి పల్లెలు పట్టణాలకు దగ్గరగా వస్తున్నాయని ఈ తరుణంలో ప్రతిఒక్కరూ గౌరవంగా ఇల్లు కట్టుకుంటున్నారని, అందులోనూ ప్రతి ఒక్కరికీ ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఇసుక సప్లై, ఇటుక సప్లై చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగాలను తొలగించి ప్రైవేటు పరం చేస్తున్న పార్టీలు సైతం ఇక్కడ ఉద్యోగాల గురించి మాట్లాడటం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. ‘అసలు చర్చ చేయకుండా కేవలం చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం ఇవ్వాలంటే వీలు పడుతుందా’ అంటూ ప్రశ్నించారు. కాగా, సుదీర్ఘకాలంగా పేగులు తెగేలా కొట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యం ఉద్యోగాల కోసమేనని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్న క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని కొంతమంది స్థానిక ఎంపీపీలు, జెడ్పీటీసీలు చెప్పుకోవడం విశేషం.

Advertisement

Next Story