బిగ్‌బ్రేకింగ్.. మంత్రి మల్లారెడ్డి సోదరుడు అరెస్టు..

by Anukaran |   ( Updated:2021-06-16 09:05:29.0  )
mallareddy-minister 1
X

దిశ, కంటోన్మెంట్ : ఆయనో మంత్రి సోదరుడు.. కరోనా నిబంధనలు ఉల్లంఘించాడు.. అక్రమ జూదం దందాకు తెరలేపాడు. రక్షణశాఖకు చెందిన ఓల్డ్ గ్రాంట్స్ బంగళా(గార్డెన్) ను పేకాట కేంద్రంగా మార్చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతూ అడ్డంగా పోలీసులకు బుక్ అయ్యాడు.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. న్యూ బోయిన్ పల్లిలోని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన ఫంక్షన్ హాల్ (మల్లారెడ్డి గార్డెన్) కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఓల్డ్ గ్రాంట్స్ బంగళాలో నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఫంక్షన్ హాల్‌కు గత కొంతకాలంగా గిరాకీ లేదు. దీంతో మంత్రి మల్లారెడ్డి సోదరుడు చామకూర నర్సింహరెడ్డి గార్డెన్‌ను పేకాట స్థావరంగా మార్చేశాడు. గత కొంతకాలంగా గార్డెన్‌ను పేకాట శిబిరంగా మార్చినట్లు సమాచారం. తన సోదరుడు మంత్రి మల్లారెడ్డి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నగరంలోని పలువురు పేకాట రాయుళ్లతో ఆడిస్తున్నారు. జీడిమెట్లకు చెందిన కౌడి సాయిలు సహా అర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నాడు.

సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట శిబిరంపై బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మంత్రి సోదరుడు నర్సింహ్మారెడ్డితోపాటు జీడిమెట్లకు చెందిన కౌడి సాయిలు, సైదాబాద్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బి.నర్సింహ్మరావు, సీతాఫల్ మండికి చెందిన ఎస్.హన్మంతు, తిరుమలగిరికి చెందిన బి.సుదర్శన్ రెడ్డి, పాత బోయిన్ పల్లికి చెందిన కె.మోహన్ రెడ్డి, జీడిమెట్లకు చెందిన వి.భాస్కర్ రెడ్డి, అంబర్ పేటకు చెందిన కె.గోవర్దన్ రెడ్డి, కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన బి.జనార్దన్ రెడ్డి, మాదాపూర్ కు చెందిన పి.శ్రీనివాస్ రాజు, కెపిహెచ్‌బీ కాలనీకి చెందిన ఈ.వెంగల్ రెడ్డి, కూకట్ పల్లికి చెందిన కె.నర్సిరెడ్డిలతో పాటు మల్లారెడ్డి గార్డెన్‌కు చెందిన బత్తిని క్రిష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఒక లక్ష 40 వేల 740 రూపాయల నగదు,13 సెల్ ఫోన్లు, 52 ప్లే కార్డులు, 3 కొత్త ప్లేకార్డు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని బోయిన్ పల్లి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story